Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి బదిలీలు చేపట్టాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్కేభవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ట్రెసా బృందం కలిసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం చేపడుతున్న జోనల్ బదిలీలు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి జీవో నెంబర్ 317లో పొందుపర్చిన పలు అంశాలతో పాటు ప్రొఫార్మాలో ఇంకా చేర్చాల్సిన పలు అంశాలను చర్చించారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ బదీలలకు ఉద్యోగులకు ఆప్షన్స్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ప్రొఫార్మాలో పీహెచ్సీ, జీవిత భాగస్వామి కేటగిరీలతో పాటు ఆరోగ్య పరిస్థితులు అనే ఆప్షన్ కూడా పొందుపర్చాలని సూచించారు. పీహెచ్సీ కేటగిరీలో 45 ఏండ్లకుపైబడిన వారికి నిబంధనల ప్రకారం ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు 2016 లో ఆర్డర్ టూ సర్వ్ కింద బదిలీలు చేసిన ఉద్యోగులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. సొంతజిల్లా, ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా, మొదటి నియామకపు జిల్లాలను కూడా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ శాఖను బలోపేతం చేసేందుకు గరిష్ట క్యాడర్ స్ట్రెంత్‌ను నిర్ధారించాలన్నారు. డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పదోన్నతులు కల్పించాలని కోరారు. డీపీసీ ఆమోదం పొంది తహసీల్దార్లుగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డిప్యూటీ తహసీల్దార్లకు పోస్టింగ్ ఇవ్వాలని విన్నవించారు. 2017-18నుంచి డిప్యూటీ తహసీల్దార్ల కొత్త ప్యానెల్స్ తయారు చేయాలన్నారు. సుదూర ప్రాంతాల్లో పని చేస్తున్న ప్రొబేషనరీ నాయబ్ తహసీల్దార్లకు జిల్లా బదిలీల అవకాశం కల్పించాలన్నారు. వీఆర్వోలకు బదిలీ ఆప్షన్స్, వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ట్రెసా సూచనలను పరిశీలించి పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రెసా అసోసియేట్ అధ్యక్షులు మన్నె ప్రభాకర్, ఉపాధ్యక్షులు బాణాల రాంరెడ్డి, కె. నిరంజన్ రావు, కె. నాగమణి, కార్యదర్శి మాధవి రెడ్డి, ఆర్గనైసింగ్ సెక్రటరీ నజీమ్ ఖాన్, కార్యవర్గ సభ్యులు నిర్మల, రామకృష్ణ, రమణ్‌రెడ్డి, కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ లాల్, తదితరులు పాల్గొన్నారు.