Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డిలో ప్రయోగాత్మకంగా అమలు
- ప్రతీ పైసా ప్రజలకు చేరాలి : మంత్రి హరీశ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అన్ని శాఖల ఆడిటింగ్ నూటికి నూరు శాతం ఆన్లైన్లోనే జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. దీన్ని రంగారెడ్డి జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి, అమలు చేయాలని ఆయన కోరారు. ప్రతీపైసా ప్రజలకు చేరటమే లక్ష్యంగా పని చేయాలని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎమ్సీఆర్ హెచ్ఆర్డీ)లో ఆడిట్ విభాగంపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆన్లైన్ ఆడిటింగ్‌తో పంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో పూర్తి స్థాయిలో రికవరీ, అభ్యంతరాలు పరిష్కారమయ్యేలా చూడాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. స్థానిక సంస్థలకు, ఇతర శాఖల నుంచి వచ్చే అభ్యంతరాలకు సంబంధించిన పేరాలను పూర్తిగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లో కచ్చితంగా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రజాధనం వృధా కాకుండా, డబ్బును సరైన రీతిలో వినియోగించాలని కోరారు. ఒకవేళ నిధులు దుర్వినియోగమైతే శాఖల వారీగా సమాచారం తెప్పించాలని కోరారు. రైతుల రుణమాఫీకి సంబంధించి బ్యాంకులు, సంబంధిత శాఖల వద్దనున్న సమాచారాన్ని సరిపోల్చుకుని చూసుకోవాలన్నారు. స్వయం సహాయక బృందాలన్నింటికీ వడ్డీ లేని రుణాలు అందుతున్నాయో..? లేదో..? పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆ శాఖ సలహాదారు జీఆర్ రెడ్డి, కార్యదర్శులు శ్రీదేవి, రొనాల్డ్రోస్తోపాటు ఇతర విభాగాధిపతులు, జిల్లాల ఆడిట్ అధికారులు పాల్గొన్నారు.