Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉద్యోగుల విభజనకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెంబర్ 317లో స్పష్టత లేదని తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) విమర్శించింది. రాష్ట్ర ఉత్తర్వులను కొత్త నియామకాలకే వర్తింపచేయాలని టీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మునగాల మణిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ జీవోలో స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు గందరగోళానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలను మాత్రమే సంప్రదించి ఆ జీవోను విడుదల చేయడాన్ని తాము తప్పుపడుతున్నామని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలనూ సీఎస్ చర్చలకు ఆహ్వానించాలనీ, అక్కడ వచ్చే సూచనలకు అనుగుణంగా ఆ జీవోను సవరించాలని డిమాండ్ చేశారు.