Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరి మృతదేహం లభ్యం
నవతెలంగాణ-ముదిగొండ
ఎన్ఎస్పీ కాలువలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలో కట్టకూరులో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువకులు నిజామాబాద్ జిల్లాకు చెందిన నాగరాజు వరికోత యంత్రంపై ఆపరేటర్లుగా పని చేస్తున్నారు. మేడేపల్లి గ్రామానికి చెందిన ఊటుకూరు సైదులు ద్వారా మేడేపల్లి, కట్టకూరు గ్రామాలకు వరి కోతల కోసం 15 రోజుల కిందట వచ్చారు. కట్టకూరు గ్రామంలోని నాగార్జునసాగర్ కాలువ సమీపాన సోమవారం రాత్రి 11:00 వరకు మిషన్తో నూర్పిడి చేశారు.అనంతరం సమీపంలో ఉన్న ఎన్ఎస్పీ కాలువలోకి స్నానం కోసం దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి మణి(19) కాలువ లోతుల్లోకి వెళ్లగా.. అతన్ని కాపాడే యత్నం చేసిన గమి(30), సాజన్(29) కూడా అందులో పడిపోయారు. సాగర్ కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటం.. వారికి ఈత రాకపోవడంతో ప్రవాహంలో గల్లంతయ్యారు. కాలువ గట్టుపైన చెప్పులు, బైకు, బట్టలు ఉండటంతో బహిర్భూమికి వచ్చిన కట్టకూరు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.ఖమ్మం రూరల్ సీఐ పి.సత్యనారాయణరెడ్డి, ఎస్ఐ తోట నాగరాజు, ఇరిగేషన్ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని ముగ్గురు యువకుల కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. ఒకరి మృతదేహం లభ్యమైంది. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తోట నాగరాజు కేసు తెలిపారు.