Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుపేద గిరిజన విద్యార్థికి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్
- క్యాంపస్ సెలెక్షన్లో ఎన్నికైన మూడావత్ దశరథ్ నాయక్
నవతెలంగాణ-బడంగ్పేట్
రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబమది. అయినా చదువు మీద ఉన్న ఇష్టం.. సాధించాలన్న తపనతో పట్టువిడువకుండా అనుకున్నది సాధించాడు గిరిజన విద్యార్థి మూడావత్ దశరత్ నాయక్. ఐఐటీ రూర్కిల్లో కెమికల్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుండగానే క్యాంపస్ సెలక్షన్లో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీకి ఎంపికయ్యాడు. ఏడాదికి రూ.21 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు.నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట్ మండలం, అక్కారం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన మూడవత్ లోక్యానాయక్, కౌసల్య దంపతుల కుమారుడు మూడావత్ దశరథ్ నాయక్. బతుకు దెరువుకోసం ఆ దంపతులు హైదరాబాద్‌కొచ్చి బీఎన్‌రెడ్డినగర్‌లో నివాసం ఉంటున్నారు. లోక్యానాయక్ ఆటోడ్రైవర్ కాగా, కౌసల్య కూలిపని చేస్తుంది. ఎంతో కష్టపడి తమ కొడుకును చదివించుకుంటున్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన దశరథ్ నాయక్ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చిన్ననాటి నుంచే అవగతం చేసుకున్నాడు. బాగా చదివి పేదరికాన్ని జయించాలని అనుకునేవాడు. తల్లిదండ్రులు కూడా అతనికి అదే చెప్పేవారు. ప్రాథమిక విద్య అచ్చంపేట్‌లోని గౌతమీ హైస్కూల్లో పూర్తి చేసి అక్కడ టాపర్‌గా నిలిచిన దశరథ్, ఇంటర్మీడియట్ రాజేంద్రనగర్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలో చదివాడు. ప్రస్తుతం ఢిల్లీలో ఐఐటీ రూర్కిలో కెమికల్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అక్కడే క్యాంపస్ సెలక్షన్స్‌లో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఎంపికయ్యాడు.