Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరోకరికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-దమ్మపేట
పశువులను వెతకడానికి వెళ్లిన తండ్రీకొడుకులు.. ఓ మామిడి తోటలో విద్యుత్ వైర్లు తగిలి ప్రాణం కోల్పోయారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోని రంగువారిగూడెం గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..
గ్రామానికి చెందిన ప్రొద్దుటూరి డానియేలు(45), కుమారుడు ప్రొద్దుటూరి బాలు(22) సోమవారం రాత్రి అయినా పశువులు ఇంటికి రాకపోవడంతో వెతికేందుకు వెళ్లారు. వారి వెంట ప్రొద్దుటూరి విజరుకుమార్ను తోడుగా తీసుకొని గ్రామ శివారులోని మామిడి తోటలోకి వెళ్లారు. అక్కడ జంతువుల కోసం వేటగాళ్ళు అమర్చిన విద్యుత్ వైరు తండ్రీకొడుకుల కాళ్లకు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన విజరుకుమార్ను ఆస్పత్రికి తరలించారు. తండ్రీకొడుకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. అశ్వారావుపేట సీఐ బంధం ఉపేంద్రకుమార్, ఎస్ఐ వెంకటరాజు ఘటనా స్థలికి చేరుకొని పంచనామా నిర్వహించి వివరాలు సేకరించారు.