Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తడిచిన ధాన్యం కొనాలని రైతుల రాస్తారోకో
నవతెలంగాణ-కామారెడ్డి టౌన్
'వరి పంట కోసి రెండు నెలలు అవుతోంది. అప్పటి నుంచి కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నాం. రాత్రి, పగలు ధాన్యం కాపాడుకోవడానికి కావలా ఉండలేక చచ్చిపోతున్నాం. మా ధాన్యం కౌంటరా.. కొనరా.. చెప్పండి. ధాన్యం తడిచిపోయి మొలకలు వచ్చినరు.. ఏం చేయమంటారు సారూ..' అంటూ అన్నదాతలు వాపోయారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామంలో సిరిసిల్ల-కామారెడ్డి రహదారిపై మంగళవారం రాస్తారోకో చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించినా వినిపించుకోలేదు. 'మా బాధ మీరైనా అర్థం చేసుకోండి సార్.. లేదంటే మేము ధర్నా చేసినందుకు అరెస్టు చేస్తారా.. చేయండి' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుంచి 350 వరకు సీరియల్ నంబర్లు ఇచ్చారని, ఇప్పటి వరకు 100 కూడా పూర్తి కాలేదని చెప్పారు. అకాల వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయి మొలకలు వచ్చాయని, ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలని ప్రశ్నించారు. కలెక్టర్, అధికారులు, ఎమ్మెల్యేలకు తమ గురించి ఇసుమంతైనా ఆలోచన ఉందా? అని ప్రశ్నించారు. ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.