Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీఆర్ భూదందాపై ఈడీ విచారణ నేపథ్యంలోనే..:రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మంత్రి కేటీఆర్ రూ 3వేల కోట్ల భూదందాకు పాల్పడిన కేసును ఈడీ విచారించనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటును బారుకాట్ చేశారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళనను పక్కదోవ పట్టించేందుకు వారు పోడియం చుట్టూ ఆందోళన చేశారని విమర్శించారు. ఈడీలకు, బీడీలకు భయపడబోమంటూ బీరాలు పలికిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. హైదరాబాదు శివారు ప్రాంతాల్లో కేసీఆర్ సన్నిహితులకు మూడు వేల కోట్ల విలువైన భూముల కట్టబెట్టిన విషయంలో ఈడీ నోటీసులు ఇచ్చిందనీ, వారందరినీ పిలిచి విచారించిందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 సంవత్సరాల క్రితం విదేశీ కంపెనీలకు రూ 450 కోట్లకు ఈ భూములను అప్పట్లో నాటి ప్రభుత్వం కట్టబెట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ నేతలు వారి నుంచి బలవంతంగా రూ 350 కోట్లకు కొనుగోలు చేశారని ఆరోపించాపరు. హైదరాబాద్‌కు చెందిన పెద్ద రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్, టీవీ యజమానికి ఈ భూములు కట్టబెట్టారని ఆరోపించాపరు. ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకే పార్లమెంట్లో ఎంపీలు ఆందోళన విరమించారని విమర్శించారు. భూముల వ్యవహారంలో కేటీఆర్‌ను విచారించాలని ఈడీ ప్రయత్నించిందనీ, కానీ చివరి నిమిషంలో వాయిదావేసిందన్నారు. భూముల అక్రమాల్లో మంత్రి కేటీఆర్ సంతకం చేశారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజాం వారసుల కంటే కేసీఆర్ వారసులు ఎక్కువ ఆస్తులు కూడబెట్టుకున్నారని విమర్శించారు. రాజకీయ ఒడంబడికలో భాగంగానే టీఆర్ఎస్, బీజేపీలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారనీ, టీఆర్ఎస్ నాయకులు ఎక్కడ కనిపించినా కోడిగుడ్లు, రాళ్లు, కర్రలతో కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
9 నుంచి డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రారంభం :మహేష్‌కుమార్ గౌడ్
రాష్ట్రంలో ఈ నెల 9న కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభిస్తామని టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్ తెలిపారు. మొత్తం 30 లక్షల సభ్యత్వం నమోదు చేయడమే లక్ష్యంగా పని చేయాలని కోరారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ, టీఆర్ఎస్ పరస్పరం విమర్శించుకుని వరి రైతుల సమస్యను పక్కదోవ పట్టించాయని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. గతంలో హామీ ఇచ్చినట్టుగా ఆఖరి గింజ వరకు కొనుగోలు చేసి కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కోవిడ్ కారణంగా ఢిల్లీలో చేపట్టాల్సిన నిరసనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు.