Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ప్రభుత్వానికి సమర్పించనున్న శాఖలు
- నేటినుంచి ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరణ
- నెలాఖరులోగా కేటాయింపులు
- ఉపాధ్యాయులపై అధికారుల తర్జనభర్జన
- వేసవిలోనే కేటాయింపులుండే అవకాశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన సీనియార్టీ జాబితాను అన్ని శాఖల ఉన్నతాధికారులూ సిద్ధం చేశారు. ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం నాటికి సమర్పించే అవకాశమున్నది. బుధవారం నుంచే ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్లు స్వీకరించే అవకాశమున్నది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) విడుదల చేయనుంది. ఈనెల 25లోగా ఆప్షన్లకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వానికి పంపించాలని అధికారులకు సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. ఈనెలాఖరులోగా ఉద్యోగులకు సీనియార్టీ ప్రాతిపదికన స్థానికత ఆధారంగా కేటాయింపులు చేసే అవకాశమున్నది. ఇందుకు సంబంధించి అధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు. అయితే పాఠశాల విద్యాశాఖలో పరిస్థితి అంత అనుకూలంగా లేదని అధికారులు భావిస్తున్నారు. సీనియార్టీ జాబితా సిద్ధంగానే ఉన్నది. దాన్ని బుధవారం ప్రభుత్వానికి అధికారులు సమర్పిస్తారు. ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్లు సైతం స్వీకరిస్తారు. అయితే కేటాయింపులపై మాత్రం వారు తర్జనభర్జన పడుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యాసంవత్సరం సకాలంలో ప్రారంభం కాలేదు. సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. ప్రస్తుతం పాఠ్యాంశాల బోధన సక్రమంగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు కొత్త జిల్లాల వారీగా విభజన చేస్తే విద్యార్థులు నష్టపోతారని అధికారులు సమాలోచన చేస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇతర శాఖల తరహాలో కాకుండా ఉపాధ్యాయుల కేటాయింపులను వేసవి సెలవుల్లో చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ఇదే అంశాన్ని ప్రభుత్వానికి నివేదించే అవకాశమున్నది. సర్కారు నిర్ణయాన్ని బట్టి ఉపాధ్యాయుల కేటాయింపులుంటాయని తెలుస్తున్నది. కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయుల విభజనకు సంబంధించి గురువారం డీఈవోలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో మరింత స్పష్టత వచ్చే అవకాశమున్నది. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల ప్రకారం ఉద్యోగుల విభజనను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా జీవోనెంబర్ 317ను విడుదల చేసింది.
జాగ్రత్తగా ఆప్షన్ ఇవ్వాలి : టీఎన్జీవో
ఉద్యోగులు జాగ్రత్తగా ఆప్షన్ ఇవ్వాలని టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో ఆయన భేటీ అయ్యారు. ఉద్యోగుల బదిలీల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. స్పౌస్ కేసుల బదిలీలపై జిల్లాల నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చాయనీ, వాటిని సీఎస్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. భార్యాభర్తలు ఒకేచోట పనిచేసేలా చూడాలని కోరారు. అవసరమైతే సూపర్‌న్యూమరరీ పోస్టులను సైతం సృష్టిస్తామని హామీ ఇచ్చారని వివరించారు. జిల్లా క్యాడర్ పోస్టులతో పాటే జోనల్ పోస్టుల విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా నెలాఖరులోగా ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసిందని సొమేశ్‌కుమార్ తెలిపారు. ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ కోసం ప్రతి జిల్లాకూ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించామని పేర్కొన్నారు.