Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో కదం తొక్కిన టీచర్లు, ఆయాలు
- నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, ధర్నా
- ఐసీడీఎస్‌ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్
- కేంద్రాల పరిరక్షణకు ఉద్యమబాట పడతామని స్పష్టం
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాల విలీనం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీచర్లు, ఆయాలు డిమాండ్ చేశారు. ఐసీడీఎస్‌ను యథావిధిగా కొనసాగించాలని, పెంచిన పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కదం తొక్కారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియాన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టారు.
'అంగన్వాడీ కేంద్రాల విలీనం ఆపాలి' 'గౌరవ వేతనం వద్దు. కనీస వేతనం ఇవ్వాలి' 'ఐసీడీఎస్‌ను యథావిథిగా కొనసాగించాలి' 'పెంచిన వేతనాలు చెల్లించాలి' అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా కేంద్ర సర్కారు ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోంని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీల పరిరక్షణకు మరోమారు పోరుబాట పడతామని సర్కారును హెచ్చరించారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, యూనియన్ గౌరవాధ్యక్షులు రమేష్‌బాబు ధర్నానుద్దేశించి మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు సేవలందిస్తున్న ఐసీడీఎస్ పథకానికి బడ్జెట్ పెంచి సమర్థవంతంగా నడపాల్సిన ప్రభుత్వాలు.. ఆ బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదరికం, నిరుద్యోగం, పోషకాహార లోపం, రక్తహీనత, సరైన ఎత్తు, బరువు లేని పిల్లల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా ఉందని గుర్తు చేశారు. ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేస్తే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ సర్కారు వత్తాసు పలకడం మానాలని హితవు పలికారు. పైగా జిల్లాలో నిరసనలు, ఆందోళనలు నిలువరించేందుకు అప్రజాస్వామిక పోకడలకు పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలు చేపడితే వేతనం కట్ చేస్తున్నారన్నారు. అంగన్వాడీ ఉద్యోగులకు పెంచిన పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్రం పెంచిన వేతనాలు 2018 అక్టోబర్ నుంచి చెల్లించాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు మిని అంగన్వాడీ వర్కర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్‌కు సంబంధం లేని అదనపు పనులు చేయించొద్దన్నారు. సర్వేల పేరిట సేవలు చేస్తున్నప్పటికీ.. స్మార్ట్‌ఫోన్, నెట్ బిల్లు ఇవ్వడం లేదని వాపోయారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్బంధాలు అంగన్వాడీలకు కొత్తేమీ కాదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుర్రాలతో తొక్కించి, బాష్పవాయువులు ఉపయోగించారని, కానీ ఎక్కడా వెనక్కి తగ్గలేదని గుర్తు చేశారు. అదే పోరాట స్ఫూర్తితో అంగన్వాడీ కేంద్రాలను పరిరక్షించుకుంటామని స్పష్టం చేశారు. ఈ ధర్నాలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దేవగంగు, కార్యదర్శి స్వర్ణ, కరుణాదేవి తదితరులు పాల్గొన్నారు.