Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.19వేల నుంచి రూ.16,500కు పడిపోయిన రేటు
- వ్యాపారుల మోసంపై రైతుల ఆగ్రహం
- ఆందోళనలకు రాజకీయ పార్టీల మద్దతు
- చాంబర్ ఆఫ్ కామర్స్ అభాసుపాలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి, గాంధీచౌక్
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు రైతుల కష్టార్జితంతో చెలగాటమాడుతున్నారు. ఒకే రోజు అమాంతం ధర తగ్గించారు. చాంబర్ ఆఫ్ కామర్స్‌లోని సీనియర్ ట్రేడర్స్‌ను పక్కనబెట్టి కొందరు యువ వ్యాపారుల అత్యుత్సాహం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సరైన ధర లేకపోవడంతో రైతులు ఏడెనిమిది నెలలుగా కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. అనూహ్యంగా సోమవారం జెండా పాటకు మించి ఓ ఇద్దరు వ్యాపారులు రెండు లాట్ల(34 బస్తాలు)ను క్వింటాల్ రూ.19,000 చొప్పున కొనుగోలు చేశారు. మరో వైపు సోషల్ మీడియాలో తల్లాడలో సోమవారం ఏడు బస్తాలు రూ. 25,000 ధర పడినట్టు పోస్టింగ్‌లు వెలుగుచూశాయి. వీటన్నింటినీ చూసి న రైతులు ఎంతో ఆశతో మంగళవారం మార్కెట్‌కు వచ్చారు. సోమవారం 110 శాంపిల్స్‌ను రైతులు తీసుకు రాగా, మంగళవారం 800 శాంపిల్స్‌కు పైగా తీసుకొచ్చారు. తీరా ఇక్కడికొ చ్చాక జెండాపాట రూ.16,500గా నిర్ధారించడంతో క్వింటాల్‌కు రూ. 2,500 వరకు నష్టపోవాల్సి వచ్చింది.
వ్యాపారుల మాయాజాలంపై గరంగరం
వ్యాపారుల మాయాజాలంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా పాట కొనసాగకుండా అడ్డుకున్నారు. ఒక్కరోజులో రేటు రూ.2,500 తగ్గడమేంటని ప్రశ్నించారు. అధికారులు, పాలకవర్గాన్ని నిలదీశారు. రైతులకు సీపీఐ(ఎం), కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలిచారు. ఖమ్మం మార్కెట్లో దళారుల రాజ్యం నడుస్తోందని తెలంగాణ రైతుసంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్, కార్యదర్శివర్గ సభ్యులు నాగుల్‌మీరా అన్నారు. రైతుల జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు. జిల్లా కాంగ్రెస్ మహిళా నాయకురాలు సౌజన్య సైతం వ్యాపారుల హైడ్రామాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి విషమిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి నాగరాజు, ఖమ్మం ఏసీపీ ఆంజనేయులు, త్రీటౌన్ సీఐ సర్వయ్య రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. డీఎంవో వెంటనే విషయాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఈ విషయమై తీవ్రంగా స్పందించారు. వ్యాపారులు రింగ్ అవుతున్నారా? అని ప్రశ్నించినట్టు తెలిసింది. రైతులకు అన్యాయం చేయాలని ఎవరూ చూసినా ఉపేక్షించొద్దని మార్కెటింగ్‌శాఖ అధికారులను ఆదేశించారు. తల్లాడలో క్వింటాల్ మిర్చి రూ.25వేలు పలికినట్టు రైతులను పక్కదోవ పట్టించేలా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌లపై పోలీసుశాఖకు ఫిర్యాదు చేయాల్సిందిగా డీఎంవోకు సూచించారు. జరిగిన పరిణామాలన్నింటినీ డీఎంవో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
తలపట్టుకున్న చాంబర్ ఆఫ్ కామర్స్
ఈ పరిణామంతో ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ అబాసు పాలైంది. 2017లోనూ ఇదే తరహాలో వ్యాపారులు వ్యవహరించడం తో మార్కెట్లో విధ్వంసం చోటుచేసుకుంది. ఓ ఇద్దరు వ్యాపారుల అత్యుత్సాహం ఫలితంగా చాంబర్ మొత్తం తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఓవైపు పక్కనే ఉన్న గుంటూరు, వరంగల్ మార్కెట్లో సోమవారం క్వింటాల్ మిర్చి ధర వరుసగా రూ. 16,500, 16,000గా నమోదైన సమయంలో.. ఖమ్మంలో అనూ హ్యంగా రూ.19,000 ధర పెట్టడంతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు సైతం విస్తుపోయాయి. సరైన ధరలు లేక రైతులు ఎప్ప టి నుంచో దాచుకుంటున్న నిల్వలను బయటకు తీయించి, వాటిని తాము నిల్వ చేసుకుని లబ్దిపొందాలనే కుట్రపూరిత వైఖరితోనే వ్యా పారులు ఈ తరహా డ్రామాకు తెరదీశారనే వ్యాఖ్యలు వినిపించాయి. వ్యాపారుల ఎత్తుగడను పసిగట్టిన రైతులు పెద్దఎత్తున నిరసన తెలిపారు. జెండా పాట జరగకుండా అడ్డుకున్నారు.
ఆ ఇద్దరు వ్యాపారుల మూలంగానే ఇదంతా : కొట్టెముక్కల వెంకటేశ్వర్లు- ఖమ్మం మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్
ఆ ఇద్దరు వ్యాపారుల మూలంగానే ఇదంతా చోటుచేసుకుంది. ఈ రోజు ఆ ఇద్దరు ట్రేడర్లు జెండా పాటకు రాలేదు. ఆ వ్యాపారుల పద్ధతి నచ్చక మిగిలిన ట్రేడర్లు కూడా ఈ రోజు దూరమున్నారు. సోమవారం నాటి రేటు పెట్టలేమని అంటున్నారు. లైసెన్స్డ్ ట్రేడ్ హోల్డర్స్ ఖచ్చితంగా జెండా పాటలో పాల్గొనాలి. కానీ ఆ ఇద్దరు వ్యాపారులు ఈరోజు ఇటువైపే రాలేదు. నిన్న కూడా ఆ ఇద్దరు బయటెక్కడో కొనుగోలు చేశారు. మాకు తెలిసే వరకు మధ్యాహ్నం అయింది. రైతులు కూడా పక్క మార్కెట్లో ధరలను పరిశీలించి గిట్టుబాటు అవుతుందనుకుంటేనే సరుకు తీసుకురావాలి.