Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చికిత్స పొందుతూ మృతి
- పోలీస్‌స్టేషన్ ఎదుట వీఆర్ఏలు, కుటుంబీకుల ఆందోళన
నవతెలంగాణ-బోధన్
ఇసుకమాఫియా రెచ్చిపోయింది.. ఇసుక అక్రమ తరలింపును అడ్డు కుంటున్నాడని కక్ష పెంచుకున్న దుండగులు.. ఇంటి నుంచి పిలిపిం చి వీఆర్ఏపై దాడికి తెగబడ్డారు. తీవ్రంగా గాయపడిన అతను ప్రాణం కోల్పోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన మండలం ఖండ్గాంలో మంగళవారం జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబీకుల వివరాల ప్రకారం.. బోధన్ మండలంలో మంజీరా నది పరివాహక ప్రాంతాల నుంచి అక్రమార్కులు ఇసుక తరలిస్తూ లక్షల్లో వెనకేసుకుంటున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ఆయా గ్రామాల పరిధిలో వీఆర్ఏలను కాపలా పెడుతున్నారు. ఈ క్రమంలో ఖండ్గాం గ్రామానికి చెందిన వీఆర్ఏ గౌతం(35) ఇసుకను అక్రమంగా తరలిస్తే పట్టుకుంటూ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తుండేవాడు. దీంతో కక్ష పెంచుకున్న మాఫియా.. ఆయనకు పరిచయమున్న వ్యక్తులతో సోమవారం రాత్రి ఇంటి నుంచి పిలుపించుకొని దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.
పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చిన గ్రామస్తులు, వీఆర్ఏలు
వీఆర్ఏ హత్య ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు, బాధిత బంధువులు, వీఆర్ఏ సంఘం జిల్లా నాయకులు, వీఆర్ఏలు పెద్దఎత్తున బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చారు. ఇసుక మాఫియా దాడిలో మృతిచెందిన వీఆర్ఏ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ వీఆర్ఏ సంఘం జిల్లా నాయకులు గైని దయాసాగర్ ఆధ్వర్యంలో బైటాయించారు. ఏసీపీ రామారావును, సీఐలు రవీందర్ నాయక్, ప్రేమ్ కుమార్ నిరసనకారులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అలాగే, పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తహసీల్దార్ గఫార్మియాతో వీఆర్ఏ సంఘం జిల్లా నాయకులు మాట్లాడారు. వీఆర్ఏలకు రాత్రివేళ ఇసుక అక్రమార్కులను పట్టుకునే డ్యూటీలు వేయరాదని విన్నవించారు. లేకుంటే తమకు రక్షణ కల్పించాలని కోరారు. వీఆర్ఏ కుటుంబానికి ప్రభుత్వం తరపున 50లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.