Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులకు ప్రయోజనం
- అడ్డుగా ఉన్న పిటిషిన్లను కొట్టేసిన హైకోర్టు
- జీవో నెంబర్ 16 అమలుకు మార్గం సుగమం.. పలు సంఘాల హర్షం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమ బద్ధీకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. అందుకు వ్యతిరేకం గా ఉన్న పలు పిటిష న్లను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణకు లైన్‌క్లియరైంది. సుమారు ఆరేండ్ల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్రం లోని కాంట్రాక్టు ఉద్యోగులందర్నీ క్రమబద్ధీకరి స్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ 2016, ఫిబ్రవరి 7న మంత్రివర్గం తీర్మానం చేసింది. అందుకనుగుణంగా ఫిబ్రవరి 26న జీవో నెంబర్ 16ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జీవోను సవాల్ చేస్తూ ఓయూజేఏసీకి చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించారు. జీవో నెంబర్ 16 అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వాదనలు విన్న తర్వాత ఆ జీవోకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను కొట్టేసింది. ఇప్పుడు జీవో నెంబర్ 16 అమలుకు మార్గం సుగమమైంది. దీంతో కాంట్రాక్టు ఉద్యోగ, అధ్యాపకుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. త్వరగా క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టాలని కోరుతున్నాయి.
21 ఏండ్లుగా కాంట్రాక్టు అధ్యాపకుల సేవలు
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో 2000 సంవత్సరంలో 142,143 జీవోల ద్వారా ఖాళీగా ఉన్న శాంక్షన్డ్ పోస్టుల్లో అర్హతలున్న వారినే కాంట్రాక్టు లెక్చరర్లుగా అప్పటి ప్రభుత్వం నియమించింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అదే విధానం అమలవుతున్నది. అంటే 21 ఏండ్లుగా కాంట్రాక్టు అధ్యాపకులు సేవలందిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,687 మంది, డిగ్రీ కాలేజీల్లో 926 మంది, పాలిటెక్నిక్ కాలేజీల్లో 435 మంది కలిపి 5,048 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వారికి టైంస్కేల్ అమలవుతున్నది. వారి ఉద్యోగ భద్రతకు ఆయా శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పదోన్నతులు ఇచ్చినా, కొత్త వారిని నియమించినా వారి ఉద్యోగాలకు ప్రమాదం లేదని తెలుస్తున్నది. జీవో నెంబర్ 16 అమలుకు అడ్డంకులు తొలగిపోవడంతో క్రమబద్ధీకరణ జరుగుతుందని కాంట్రాక్టు అధ్యాపకులు భావిస్తున్నారు.
తక్షణమే మార్గదర్శకాలు విడుదల చేయాలి : కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం
ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 16కు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేయడం పట్ల ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (జీసీసీఎల్‌ఏ-475) హర్షం ప్రకటించింది. హైకోర్టులో కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులకు అనుకూలంగా వాదించిన న్యాయవాది జీవీఎల్ మూర్తికి ఆ సంఘం అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ ధన్యావాదాలు తెలిపారు. హైకోర్టు తీర్పును అనుసరించి తక్షణమే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు మార్గం సుగమం : టిప్స్
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్ల క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైనందుకు తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) హర్షం వ్యక్తం చేసింది. జీవో నెంబర్ 16ను అమలు చేస్తూ క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపట్టేందుకు వీలుగా మార్గదర్శకాలను విడుదల చేయాలని టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, గాదె వెంకన్న, నగేశ్, రహీం, సమన్వయకర్త ఎం జంగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేయడం పట్ల ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షులు గాదె వెంకన్న, ప్రధాన కార్యదర్శి కుమార్ హర్షం ప్రకటించారు. త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని క్రమబద్ధీకరణను పూర్తి చేస్తుందన్న విశ్వాసముందని పేర్కొన్నారు.