Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్ అలవెన్స్ చెల్లించాలి : కమిషనర్‌కు ఆశా యూనియన్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆశాలకు ఇచ్చే కోవిడ్-19 రిస్క్ అలవెన్స్‌ను రూ.10 వేలకు పెంచాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గత 16 నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న కరోనా రిస్క్ అలవెన్స్ ను తక్షణమే చెల్లించాలనీ, పెంచిన పీఆర్సీని అమలు చేయాలనీ, ఇతర సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయలక్ష్మి, కె.సునీత, కోశాధికారి సి.లలిత రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ కు విన్నవించారు. రిస్క్ అలవెన్స్‌ను గతేడాది సెప్టెంబర్ నుంచి నిలిపేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిందనీ, దీంతో దేశవ్యాప్తంగా ఆ ఏడాది డిసెంబర్ 10న నిరసనలు చేపట్టాయని వివరించారు. 2022 మార్చి వరకు అలవెన్స్ కొనసాగిస్తామని హామీ ఇచ్చి ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తుచేశారు. అదే సమయంలో అలవెన్స్‌ను రూ.10 వేలకు పెంచే అంశంపై స్పష్టత లేదనీ, ఆశాల పర్మినెంట్, కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ ఇతర సమస్యలపై స్పందించలేదని విమర్శించారు. కేంద్రం ప్రకటించిన దాని ప్రకారం ఒక్కో ఆశా కార్యకర్తకు 19 నెలలకుగానూ రూ.19,000 ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.3,000 ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన పీఆర్సీ డబ్బులను డిసెంబర్ ఒకటి నుంచి అకౌంట్ లో వేస్తామంటూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మాట ఇచ్చి.... నిలబెట్టుకోలేదని తెలిపారు. ఫిక్స్డ్ వేతనంపై స్పష్టత ఇవ్వకుండా, స్మార్ట్ ఫోన్లకు బదులుగా కేవలం సిమ్ కార్డులను మాత్రమే ఇచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనీ, అప్పటి వరకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలనీ, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశా కుటుంబాల మొత్తానికి బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. జాతీయ ఆరోగ్య మిషన్ ప్రయివేటీకరణను ఆపాలనీ, పని భారం తగ్గించాలని కోరారు. ఏఎన్ఎం నియామకాల్లో మొదటి ప్రాధాన్యతను ఆశాలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.