Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హార్వెస్టర్ గ్యారేజీలో ఘటన
- పదునైన ఆయుధాలతో దాడి
- అన్ని కోణాల్లో విచారణ చేపట్టాం : సీపీ కార్తికేయ
నవతెలంగాణ-డిచ్పల్లి
అర్ధరాత్రి వేళ హార్వెస్టర్ గ్యారేజీలో నిద్రిస్తున్న ముగ్గురు దారుణహత్యకు గురయ్యారు. మృతులు హర్పల్ సింగ్ (33), జోగిందర్‌సింగ్ (45), సునీల్ బానోత్(45)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గురునానక్ పంజాబ్ హార్వెస్టర్ గ్యారేజీలో హర్పల్సింగ్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం అతడి బంధువు జోగిందర్‌సింగ్ వచ్చి ఇక్కడే ఉన్నాడు. హార్వెస్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్న సునీల్ బానోత్.. ఒక్కోసారి అర్ధరాత్రి గ్యారేజీలోనే బయట మంచం మీద పడుకునేవాడు. మంగళవారం రాత్రి సైతం వచ్చి అక్కడే పడుకున్నాడు. రేకుల షెడ్డులో పంజాబ్‌కు చెందినవారు నిద్రిస్తుండగా, బయట మంచంపై డ్రైవర్ నిద్రిస్తున్న క్రమంలో గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. ముగ్గురికి సైతం తలపై తీవ్ర గాయాలున్నట్టు పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం వెలుగుజూసింది. సమాచారం అందుకున్న సీఐ రఘునాథ్, ఎస్ఐ ఆంజనేయులు చేరుకొని ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు. దీంతో సీపీ కార్తికేయ, అడిషనల్ డీసీపీ అరవింద్ బాబు, స్వామి, నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు చేరుకొని క్లూజ్ టీం, డాగ్ స్క్వాడ్లను రప్పించారు. డాగ్ స్క్వాడ్ ఘటన స్థలం నుంచి ఒక కిలోమీటర్ మేర వెళ్లి నిలిచిపోయింది. క్లూస్ టీ ఘటన స్థలంలో వేలి ముద్రలను సేకరించారు. చుట్టు పక్కల ఉన్న సీసీ ఫుటేజీలను సీపీ పరిశీలించారు. గ్యారేజ్‌లో ఉన్న మూడు సీసీ కెమెరాలు కొన్ని రోజులుగా పనిచేయడం లేదని ఆటోమొబైల్ దుకాణం యజమాని సంజీవ్‌రెడ్డి తెలిపారు. హార్వెస్టర్ మెకానిక్ మరో 15 రోజుల్లో పంజాబ్‌కు వెళ్లనున్నారు. మూడు నెలల పాటు వీరు పనులు చేస్తారని సంజీవ్‌రెడ్డి తెలిపారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు : సీపీ కార్తికేయ
ముగ్గురి హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్టు సీపీ కార్తికేయ తెలిపారు. ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తాగిన మైకంలో గొడవ జరిగి ఉంటుందా ? లేక ఎవరైనా దొంగతనం చేయడానికి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారా..? లేక ఏమైనా పాత కక్షలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేస్తామని తెలిపారు. రహదారి వెంట ఉన్న సీపీ కెమెరాలను సైతం క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు.