Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం తగలబెట్టి నిరసన.. న్యాయం చేయాలని డిమాండ్
నవతెలంగాణ శాయంపేట
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 44కిలోలు తూకం తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు వరి ధాన్యాన్ని తగులబెట్టారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ప్రగతి సింగారంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొన్నటి వరకు 42కిలోల తూకం వేసిన నిర్వాహకులు, ప్రస్తుతం 44కిలోల తూకానికి అంగీకరిస్తేనే ధాన్యం కొను గోలు చేస్తామని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొను గోలు కేంద్రంలోనే రైతులు ధాన్యాన్ని తగులబెట్టి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రైతులు పెద్దిరెడ్డి మహేందర్ రెడ్డి, కర్ర వెంకట్‌రెడ్డి, చిలుకల కొమురయ్యలు మాట్లాడుతూ.. గతేడాది ఈ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యం లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా 24లక్షల అవినీతి వెలుగు చూసిం దన్నారు. ఈ క్రమంలో నిర్వాహకుల నుంచి 8లక్షల రికవరీ చేసి రైతులకు చెల్లించారని తెలిపారు. అధికారులు ఈసారి ఐకెేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వారం క్రితం 42కిలోల తూకం వేసి ఒక లోడు లారీ మిల్లుకు తరలించారని అన్నారు. ఇటీవల మండలంలో పర్యటించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు 17శాతం లోపు తేమ ఉండేలా చూసుకోవాలని, 40కిలోల 750గ్రాములు మాత్రమే తరుగు తీయాలని ఆదేశించారు. అయినా నిర్వాహకులు రైస్‌మిల్లర్లతో కుమ్మక్కై కలెక్టర్ ఆదేశాల ను బేఖాతర్ చేస్తూ 15శాతం తేమ ఉన్నప్పటికీ 44కిలోల తూకం వేయాలని సూచిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని 40 కిలోల 750 గ్రాముల తూకం వేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రైతులు హెచ్చరించారు.