Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొగ్గుబ్లాకుల వేలంపై భగ్గుమంటున్న సంఘాలు
- ప్రయివేటీకరణను నిరసిస్తూ కార్మికులంతా ఏకతాటిపై
- నేటి నుంచి మూడు రోజుల పాటు విధుల బహిష్కరణకు నిర్ణయం
- నిలిచిపోనున్న 6లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి, నస్పూర్
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా భావించే సింగ రేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల ప్రవేటీకరణపై కార్మిక సంఘాలు మండిపడు తున్నాయి. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సింగరేణి వ్యాప్తంగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా జాతీయ సంఘాలన్ని ఐక్యంగా (జేఏసీ)గా ఏర్పడి నేటి నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. విధులు బహిష్కరించి కేంద్రం దృష్టికి నిరసన గళం గట్టిగా వినిపించేందుకు సమాయత్తమయ్యాయి. కార్మికులందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించేందుకు సిద్ధమయ్యారు. ఈ సమ్మెలో గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్ కూడా భాగస్వామ్యం అవుతుంది. సింగరేణికి చెందిన నాలుగు బ్లాకులను ప్రయివేటుపరం చేసేందుకు వేలం ప్రకటన జారీ చేయడంతో వాటిని కాపాడుకోవడానికి టీబీజీకేఎస్ ఈనెల 25న సమ్మె నోటీసు జారీ చేసింది. సింగరేణి యాజమాన్యంతో పాటు కేంద్ర కార్మిక శాఖకు నోటీసులు అందజేసింది. ఇదివరకే జాతీయ కార్మిక సంఘాలు కూడా సమ్మెకు సిద్ధం కావడంతో గుర్తింపు సంఘాన్ని కూడా ఆహ్వానించాయి. బొగ్గు బ్లాకుల ప్రయివేటీకరణ ఆపడంతో పాటు మరికొన్ని అపరిష్కత డిమాండ్లతో సమ్మె సైరన్ మోగించడం ప్రాధాన్యంశంగా మారింది.
నిలిచిపోనున్న బొగ్గు ఉత్పత్తి
సింగరేణిలో సమ్మె కారణంగా బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోనుంది. కార్మికులంతా నిరసనలో భాగస్వామ్యం అవుతున్నారు. ఈ క్రమంలో సింగరేణిలో రోజూ 2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. మూడు రోజుల పాటు విధులు బహిష్కరిస్తుండటంతో ఆరు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడనుంది. బొగ్గుబ్లాకులు ప్రయివేటుపరం అయితే కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లనుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కార్పొరేట్ల చేతుల్లోకి వెళితే బొగ్గుధరలు పెరగడంతో కరెంటు ఉత్పత్తి ధరలు కూడా పెరుగుతాయి. ఈ భారం చివరకు ప్రజల మీద కూడా పడుతుంది. కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం కార్మికులకే కాకుండా ప్రజలకు కూడా తీవ్ర నష్టం చేకూర్చనుందని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు.
సర్కారు తీరుపైనా అసంతృప్తి
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు, కార్పొరేట్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా లాభాల్లో కొనసాగుతున్న సింగరేణి సంస్థను కూడా ప్రయివేటు పరం చేయాలని చూస్తుండటంతో కార్మికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి తలమానికంగా ఉన్న సింగరేణి వంటి సంస్థలో కేంద్రం ప్రయివేటీకరించే దిశగా అడుగులు వేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. కార్మిక సంఘాలన్ని సమ్మెకు పిలుపునిచ్చినా ముఖ్యమంత్రి ఎందుకు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సింగరేణిలో సీఎస్ఆర్, డీఎంఎఫ్టీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటున్నా తాజా బొగ్గు బ్లాకులను కాపాడుకోలేకపోవడం నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోందని అంటున్నారు. గతంలో ఐటీ రద్దు కోసం తీర్మానం చేశామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో బొగ్గు వేలం పాటలకు వ్యతిరేకంగా ఎందుకు తీర్మానం చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి పరోక్షంగా మద్దతు ఇస్తోందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాలు విధించిన డిమాండ్లలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే అమలయ్యేవి అనేకమున్నాయని చెబుతున్నారు. కేంద్రం తీసుకుంటున్న తాజా నిర్ణయంపై స్థానిక ప్రజాప్రతినిధులు కూడా స్పందించకపోవడం శోచనీయమని కార్మికులు మండిపడుతున్నారు.