Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంకేతిక పరిజ్ఞానంతోనే విద్యార్థులకు భవిత
- పరిశ్రమలకు అవసరమైన మార్పులు రావాలి
- 'తెలంగాణ భవిష్యత్ విద్యా' సదస్సులో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యార్థులకు డిగ్రీలు, మార్కులకన్నా నైపుణ్యమే ప్రామాణికమని పలువురు అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు దీనిపై దృష్టిసారించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతోపాటు అత్యున్నత ప్రమాణాల వల్లే వారికి భవిష్యత్ ఉంటుందని అన్నారు. పరిశ్రమలకు అవసరమైన మార్పులు విద్యారంగంలో రావాల్సి ఉందన్నారు. అప్పుడే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని వివరించారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ), తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్సీహెచ్ఈ), ఓడిన్ స్కూల్, అనురాగ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా 'తెలంగాణ భవిష్యత్ విద్య'అనే అంశంపై బుధవారం హైదరాబాద్లో సెమినార్ నిర్వహించాయి. ఈ సందర్భంగా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలిచ్చే సంస్థలు ఇప్పుడు విశ్వవిద్యాలయాల డిగ్రీలకే పరిమితం కావడం లేదనీ, విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాయని చెప్పారు. డిగ్రీ పట్టాలకు ప్రాధాన్యత తగ్గుతున్నదని అన్నారు. చాలా సంస్థలు కర్రికులమ్ వీటా అడగడం లేదనీ, నైపుణ్యం ఏంటో తెలుసుకుంటున్నాయని వివరించారు. విద్యార్థులు డిగ్రీ పట్టాల కోసం కాకుండా నైపుణ్యం పెంపొందించుకోవడంపై దృష్టిసారించాలని కోరారు. కోవిడ్ తర్వాత విద్యారంగానికి ఎన్నో సవాళ్లు సవాళ్ళు ఎదురవుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆన్లైన్ విద్యకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. చాలాచోట్ల ఆన్లైన్, ఆఫ్లైన్ బోధనకు విద్యాసంస్థలు ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు. తరగతి బోధన ద్వారానే విద్యార్థులకు విజ్ఞానం అందుతుందనీ, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని వివరించారు. అయితే మారుతున్న పరిస్థితుల్లో ఆన్లైన్ విద్య అవసరమన్నారు. ఈ దిశగా రాష్ట్రంలోనూ ఉన్నత విద్యలో మార్పులకు ప్రయత్నిస్తున్నామనీ, కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.
ఉపాధి పొందడమే విద్యార్థుల లక్ష్యం : లింబాద్రి
దేశంలో 18-23 ఏండ్ల మధ్య వయస్సున్న పదివేల మంది విద్యార్థులపై ఓ సంస్థ సర్వే చేసిందని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి చెప్పారు. ఉపాధి పొందడమే లక్ష్యమని వారు సమాధానమిచ్చారని అన్నారు. వారి భవిష్యత్, అభిరుచులు ఎంతో ముఖ్యమన్నారు. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో చదవాలనీ, అంతర్జాతీయ సవాళ్లను తెలుసుకోవాలని ఆ విద్యార్థులు భావిస్తున్నారని వివరించారు. ఈ తరహా ఆలోచనలున్న విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. డిగ్రీ, పీజీలో ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టామని వివరించారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే డిగ్రీ కాలేజీల్లో క్లస్టర్ విధానం ప్రవేశపెట్టామని అన్నారు. డిగ్రీలో బీఏ ఆనర్స్, డేటా సైన్స్ కోర్సులు తేవడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగమని వివరించారు. ఉన్నత విద్యలో చేరే విద్యార్థులు జాతీయస్థాయిలో 26 శాతం ఉంటే, తెలంగాణలో 36 శాతం ఉందన్నారు. ఓయూ పరిధిలో ఉన్నత విద్యలో 70 శాతం అమ్మాయిలే ఉండడం గర్వకారణమని చెప్పారు. ఓయూ వీసీ డి రవీందర్ మాట్లాడుతూ విద్యారంగంలో ప్రమాణాలు తగ్గాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల కొరత వర్సిటీల అభివృద్ధికి ఇబ్బందిగా మారిందన్నారు. ఓయూకు రూ.750 కోట్ల గ్రాంట్లు రావాల్సి ఉండగా ప్రభుత్వం రూ.350 కోట్లే ఇచ్చిందని అన్నారు. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సు మాత్రమే విద్య కాదన్నారు. ఏ కోర్సులో చేరినా విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. ఉపాధి కోసం చూడకుండా సొంతంగా పరిశ్రమను స్థాపించే దిశగా ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్చైర్మెన్ వి వెంకటరమణ, ఐసీసీ దక్షిణాది మండలి నిపుణుల కమిటీ చైర్మెన్ జీబీకే రావు, ప్రొఫెసర్ మాహుల్ బ్రహ్మ, ఐసీసీ రీజినల్ హెడ్ నవీన్ మడిశెట్టి తదితరులు పాల్గొన్నారు.