Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ పార్టీ ఉడత ఊపులకు భయపడం
- దున్నపోతు మీద వానపడ్డట్టు వ్యవహరిస్తున్నారు : మంత్రి కేటీఆర్
- టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత లక్ష్మీనర్సింహారావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'బీజేపీకి హిందూ, ముస్లిం.. బాబర్, అక్బర్ తప్ప దేశానికి సంబంధించిన ఏ విషయాలూ తెలియవు...' అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శించారు. 'మా పార్టీ నేతలపై కేసులు పెడతామంటూ బీజేపీ బెదిరిస్తున్నది.. కానీ దాని ఉడత ఊపులకు మేం భయపడబోం...' అని ఆయన హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత చల్మెడ లక్ష్మీనర్సింహారావు బుధవారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హైదరా బాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ పైనా, కేంద్ర ప్రభుత్వ విధానాలపైనా విమర్శలు గుప్పించారు. సోనియాగాంధీకి, మోడీకి భయపడే వాళ్లిక్కడ ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. కేంద్రం తప్పిదాల వల్లే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సమస్య తలెత్తిందని అన్నారు. ఏపీ, ఒరిస్సాలాంటి రాష్ట్రాలకు కూడా ఉప్పుడు బియ్యం సమస్య ఉందని గుర్తు చేశారు. ఈ క్రమంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదానిస్తుంది.. కానీ తెలంగాణలోని ప్రాజెక్టులకు మాత్రం ఆ హోదానివ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తే... రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు వారికెందుకు మద్దతునివ్వలేదని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, మంత్రి గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.