Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రైతులు చస్తున్నా పట్టించుకోరా...
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వానాకాలం వరిధాన్యం కల్లాల్లో రాసులు పోసి, ఎండకు ఎండి, వానకు తడిసి ముద్దయి మొలకెత్తుతున్నా ప్రభుత్వానికి సకాలంలో కొనాలనే ధ్యాస లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నదని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. రైతులు చస్తున్నా పట్టించుకోరా?అని ప్రశ్నించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఉన్న తీరిక ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు లేదా?అని అడిగారు. 50 రోజుల నుంచి లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల్లో రాసుల వద్ద రైతులు కాపలా కాస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తాత్సారం చేయడం వల్ల 20 నుంచి 30 శాతం వరకు ధాన్యం మొలకెత్తి మట్టిపాలైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించి చేతికందిన ధాన్యం కండ్లముందే పాడైతుంటే రైతుల గుండెలవిసి పోతున్నాయని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బిట్ల ఐలయ్య అనే రైతు 20 రోజులుగా అధికారులు ధాన్యం కొనలేదనే బాధతో గుండె ఆగి మరణించారని గుర్తు చేశారు. ఇంకా ఎంతో మంది రైతులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ఐకేపీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. ధాన్యాన్ని రోజూ ఆరబోయడం, కుప్పనూర్చడం వంటి పనుల వల్ల శారీరకంగా, ఆర్థికంగా నష్టపోతున్నారని వివరించారు. వానాకాలం ధాన్యాన్ని కొనాలనే ఆలోచనను ఉద్దేశ్యపూర్వకంగా దృష్టి మళ్లించడానికి యాసంగి వరి పంట గురించి బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేస్తున్నారని తెలిపారు.
అసలు సమస్య వదిలి ప్రకటనలు చేయడం ఆ పార్టీల కుటిల నీతిని తెలియజేస్తున్నదని విమర్శించారు. ఐకేపీ కేంద్రాల్లో పేరుకుపోయి ధాన్యం కొనకపోతే యాసంగి వరి పంటకు అనుమతించకపోతే రాష్ట్రంలో మిల్లర్లపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని తెలిపారు. ఐకేపీ కేంద్రాలను సందర్శించి సమస్య తీవ్రతను ప్రత్యక్షంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చూడడం సంతోషమని పేర్కొన్నారు. వరిధాన్యం కొనాలనీ, యాసంగి వరిపంటకు అనుమతిచ్చేందుకు చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి నివేదించాలని సూచించారు. గవర్నర్‌కు ఉన్న తీరిక సీఎం, మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు లేకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం, మంత్రులు ఐకేపీ కేంద్రాలను సందర్శించి కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిట్ల ఐలయ్య కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు.