Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 250 కళాశాలల్లో 50లోపు విద్యార్థులు చేరిక
- సంప్రదాయ కోర్సులకు ఆదరణ కరువు
- ప్రస్తుత విద్యాసంవత్సరంలో మిగిలిన సీట్లు 2.17 లక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. అర్హులైన అధ్యాపకులను నియమించకపోవడం, నిబంధనలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వంటి కారణాలతో ఆయా కాలేజీల్లో రోజురోజుకు ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. వాటిలో చేరితే నాణ్యమైన విద్య అందడం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో 50 డిగ్రీ కాలేజీల్లో సున్నా ప్రవేశాలు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. వాటిలో చేరేందుకు విద్యార్థులెవరూ ఆసక్తి చూపకపోవడం గమనార్హం. మరో 250 డిగ్రీ కాలేజీల్లో 50 మందిలోపే విద్యార్థులు ప్రవేశం పొందారు. ఇందులో ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలున్నాయి. రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరంలో 1080 డిగ్రీ కాలేజీల్లో 4,66,345 సీట్లుంటే, 2,49,266 మంది విద్యార్థులు చేరారు. 2,17,079 సీట్లు మిగిలాయి. 2020-21 విద్యాసంవత్సరంలో 1103 డిగ్రీ కాలేజీల్లో 4,54,703 సీట్లకుగాను 2,47,601 మంది ప్రవేశం పొందారు. అంటే 2,07,102 సీట్లు మిగిలాయి. ఈ చొప్పున ఏటా రెండు లక్షలకుపైగా సీట్లు మిగులుతున్నాయి. ఇంటర్మీడియెట్ పూర్తయిన విద్యార్థులు ఏటా సుమారు నాలుగు లక్షల మంది ఉత్తీర్ణులై బయటికి వస్తున్నారు. అయితే వారు సంప్రదాయ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి కనబరచడం లేదని పై గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, వ్యవసాయ, పారామెడికల్తోపాటు ఇతర వృత్తివిద్యా కోర్సుల్లో చేరుతున్నారు. ఇంకా కొంత మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదువుతున్నారు. దీంతో రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు చేరకపోవడంతో అవి కునారిల్లుతున్నాయి. 2017-18 విద్యాసంవత్సరంలోనూ సున్నా ప్రవేశాలున్న డిగ్రీ కాలేజీలు 51 ఉండగా, 25 శాతంలోపు ప్రవేశాలున్న కాలేజీలు 186 ఉన్నాయని ఉన్నత విద్యామండలి గుర్తించింది. అయితే ఆ కాలేజీలపై చర్యలు తీసుకోవడానికి బదులుగా వరుసగా మూడేండ్లపాటు 25 శాతంలోపు విద్యార్థులు చేరితే ఆ కోర్సులను రద్దు చేయాలని నిర్ణయించింది. దీన్ని ప్రయివేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫీజురాయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను చెల్లించడం లేదని విమర్శిస్తున్నాయి. కాలేజీ భవనాల అద్దె, అధ్యాపకులకు జీతాల చెల్లింపు, నిర్వహణ భారంగా మారిందని యాజమాన్య ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఐదు విద్యాసంవత్సరాలు పూర్తయినా అది కార్యరూపం దాల్చలేదు. అందుకే డిగ్రీ కాలేజీల్లో ఎక్కువ సీట్లున్నా చేరేందుకు విద్యార్థులు ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా ఈ అంశంపై ఉన్నత విద్యామండలి అధికారులు దృష్టి సారించి సరైన నిర్ణయం తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు. ప్రమాణాలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.