Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్రలో 10 కేసులు
- కర్నాటకలోనూ వెలుగుచూసిన కేసులు
- ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆందోళన
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్'.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లావాసులను ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొత్త వేరియంట్ కేసులు నమోదుకాకపోయినప్పటికీ.. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు అనుకుని ఉన్న రెండు రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్నాటకలో వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 10 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదుకాగా.. పూణేలో అత్యధికంగా కేసులు ఉన్నాయి. ఇటు కర్నాటకలోనూ రెండు కేసులు నమోదయ్యాయి. నిత్యం వేలాది మంది వాణిజ్య, వ్యాపార, వైద్య ఇతర అవసరాల కోసం జిల్లాకు రాకపోకలు సాగిస్తుంటారు. దీనివల్ల ప్రమాదం లేకపోయినా జాగ్రత్తలు పాటించాలని ఇరు జిల్లాల కలెక్టర్లు ప్రజలను హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 55,604 మంది కోవిడ్ బారిన పడ్డారు. మొత్తం 4,79,919 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. సెకండ్ వేవ్ అనంతరం జిల్లాలో కేసుల సంఖ్య పూర్తిగా తగ్గింది. గత రెండు రోజులుగా పాజిటివ్ కేసులేమీ నమోదు కాలేదు. కానీ ప్రస్తుతం దేశంలో చాపకింద నీరులా కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూస్తుండటంతో జిల్లావాసులను కలవరానికి గురిచేస్తోంది. కొవిడ్ నిబంధనలను పక్కాగా పాటించడంతో పాటు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని అధికారులు ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత కోవిడ్ కేసుల నమోదు తీవ్రత నిజామాబాద్ జిల్లాలోనే అత్యధికం. ఇందుకు ప్రధాన కారణం జిల్లాకు అనుకుని మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దులు ఉండటం. ప్రస్తుతం అక్కడనుంచే కేసులు వస్తుండడంతో అప్రమత్తం కావాలని అధికారులు కోరుతున్నారు.సెకండ్ వేవ్ సమయంలో జిల్లాలో ఆస్పత్రుల్లో కనీసం బెడ్స్ కూడా దొరకని పరిస్థితి నెలకొంది. అయితే జాగ్రత్తలు తీసుకోవాలని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాక్సిన్ వేసుకోవడంతో పాటు మాస్క్ విధిగా పాటించాలని సూచిస్తున్నారు.