Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెస్‌చార్జీలు పెంచాలి : వ్యవసాయ కార్మిక సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.ప్రసాద్, ఆర్.వెంకట్రాములు డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర ధరలకనుగుణంగా మెస్‌చార్జీలను పెంచాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని నీరుగార్చటంలో భాగంగానే నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. ఆ పథకం నిర్వీర్యమైతే అంతిమంగా నష్టపోయేది పేద, వ్యవసాయ కార్మికుల పిల్లలేనని ఆవేదన వ్యక్తం చేశారు. అక్షయపాత్ర, నాంది పౌండేషన్, తదితర స్వచ్ఛంద సంస్థలకు పథకం నిర్వహణను అప్పగించి కేంద్రం తప్పుకోజూడటం బాధ్యతారాహిత్యమేనన్నారు. భావి భారత పిల్లలకు పౌష్టికాహారం అందకుండా చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర దాని వెనుక దాగి ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టడంలోనూ, కేంద్రం నుంచి బకాయిలను రప్పించడంలోనూ రాష్ట్ర సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ.280 కోట్ల బిల్లులను వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులకు అందేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి సెంటర్లు నడపడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. గుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.ఆంజనేయులు పాల్గొన్నారు.