Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీపుల్స్ ప్లాజాలో ప్రారంభించనున్న మంత్రి జగదీశ్‌రెడ్డి: టీఎస్రెడ్కో ఎండీ జానయ్య వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, ప్రాధాన్యతను వివరించేందుకు వీలుగా ఈనెల 11,12 తేదీల్లో హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో ప్రదర్శన జరగనుందని తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (టీఎస్రెడ్కో) వైస్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ జానయ్య చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రదర్శనను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్‌రెడ్డి ప్రారంభిస్తారని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత ఎక్కువ కావాల్సి ఉందన్నారు. దేశంలో ఇంధన వనరుల్లేక విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతున్నదని చెప్పారు. పెట్రోల్, డీజిల్ వాహనాలను వినియోగించడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతున్నదని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు తమ వినియోగించడం వల్ల తక్కువ ఖర్చుతోపాటు కాలుష్యాన్ని తగ్గించొచ్చని వివరించారు. టూవీలర్, ఫోర్ వీలర్, త్రీ వీలర్ వాహనాలను ప్రదర్శనలో ఉంటాయని చెప్పారు. వాటిని ఉత్పత్తి చేసే సంస్థలుకు, రుణాలు ఇచ్చేందుకు బ్యాంకుల ప్రతినిధులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీని వివరించేందుకు అధికారులుంటారని వివరించారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తక్కువ కరెంటుతోనే ఎలక్ట్రిక్ వాహనాలు వాడొచ్చని చెప్పారు.ఈ కార్యక్రమంలో టీఎస్రెడ్కో జనరల్ మేనేజర్ డీఎస్వీ ప్రసాద్, ప్రాజెక్టు డైరెక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.