Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
గ్రామీణ ఉపాధి హామీ లో పని చేస్తున్న కూలీల పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. హరితహారం మొక్కల వాచర్స్ తొలగింపును ఆపాలనీ, పని దినాలు, వేతనాలు పెంచాలని కోరింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి ప్రసాద్ అధ్యక్షతన గురువారం ఆన్లైన్లో వ్యకాస రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేస్తున్న హరితహారం మొక్కలను పెంచడంలో కీలకంగా పని చేస్తున్న వాచర్స్కు పనిదినాలు లేవంటూ వేలాది మంది కూలీలను తొలగించడం అన్యాయమన్నారు. ఐదారు నెలలు నుంచి చేసిన పనికి వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని తెలిపారు. పని దినాలను 200 రోజులకు పెంచాలనీ, రోజు కూలీ రూ 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులను కేటాయించి పట్టణ, నగర పంచాయతీల్లోని కూలీలకు పని కల్పించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పేదల పొట్టకొట్టాలని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కొత్తజాబ్ కార్డులను గ్రామ పంచాయతీల్లో ఇవ్వాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి పద్మ, పొన్నం వెంకటేశ్వర్లు, మచ్చా వెంకటేశ్వర్లు, కొండమడుగు నర్సింహ్మ, ఎం సైదులు, కె జగన్, రాష్ట్ర కార్యదర్శులు ఆవుల వీరన్న, ఎ వెంకట్రాజం, ఎం వెంకటయ్య, ఎం ఆంజనేయులు, యు గోపాల్, పద్మ తదితరులు పాల్గొన్నారు.