Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి: కమిషనర్‌కు టియుఎంహెచ్ఇయూ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో104 ఫిక్స్డ్‌డ్ డే హెల్త్ సేవలను కొనసాగించాలనీ, అందులో పని చేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపాల్, కె.యాదానాయక్ నాయకత్వంలో ప్రతినిధులు గురువారం రాష్ట్ర కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణను కలిసి వినతిపత్రం సమర్పించారు. 104 వాహనాల ద్వారా ఇంటి వద్దనే పరీక్షలు, మందులివ్వటమనే కార్యక్రమాలు ఆరోగ్య తెలంగాణకు ఉపయోగపడ్డాయని చెప్పారు. వాటిని కొనసాగించాలన్న ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ పథకం పరిధిలో 198 వాహనాల్లో 1,250 మంది సిబ్బంది పని చేస్తున్నారనీ, ఈ సేవలు నిలిచిపోతే వారికి ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారులు సేవలు నిలిచిపోతాయంటూ, సర్దుబాటు పేరుతో దూరప్రాంతాలకు సిబ్బందిని పంపడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఖాళీల ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించాలనీ, వారి సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్ నియామకాల్లో ప్రాధాన్యతని వ్వాలని కోరారు. ఈ మేరకు కిందిస్థాయి అధికారులకు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
కృతజ్ఞతలు....
104 ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లటం ద్వారా వాటి పరిష్కారానికి కృషి చేస్తామంటూ కమిషనర్ తెలిపారని నాయకులు వెల్లడించారు. ఉద్యోగుల భవిష్యత్తుపై ఆమె స్పష్టమైన హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులందరినీ కొనసాగిస్తామనీ, ఖాళీ పోస్టుల్లో సర్దుబాటు చేస్తామని ఆమె తెలిపారని వివరించారు. ఈ కార్యక్రమంలో 104 నాయకులు విజయవర్థన్ రాజు, నవీన్, శ్రీనివాస్, మతీన్, నాగ్ నాథ్, సుభాష్, పాలయ్య, కరుణాకర్ పాల్గొన్నారు.