Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తుల పేరుతో కాలయాపన
- మూడు నెలలైనా కొలిక్కి రాని ప్రక్రియ
- ఆందోళనలో బాధిత కుటుంబాలు
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
''నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ పరిధిలో భాస్కర్ అమ్మ, అన్న, వదిన కరోనాతో మృతిచెందారు. అన్నకు 18 ఏండ్లలోపు ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం వీరి బాగోగులు భాస్కర్ చూస్తున్నారు. కరోనా సాయం అందితే పిల్లల చదువుకు ఉపయోగపడతాయని ఎదురు చూస్తున్నారు''. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్‌పేట, హన్వాడ మండలాల్లో కరోనాతో నలుగురు చనిపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను స్త్రీ శిశుసంక్షేమ శాఖ బాలవికాస కేంద్రంలో చేర్పించింది. కరోనాతో ప్రాణం కోల్పో యిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయాన్ని ప్రకటించాయి. ఈ ప్రక టన చేసి మూడు మాసాలైనా అధికారులు దరఖాస్తుల సేక రణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. భార్యాభర్త ఇద్దరూ మృతిచెందిన కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారిం ది. తల్లిదండ్రుల ఆలనా పాలనకు దూరమైన పిల్లలు దుర్భర జీవితం సాగిస్తున్నారు. ఈ కుటుంబాలకు ప్రకటించిన సాయం కొంత మేరకైనా ఉపశమనం కలిగిస్తుందనే ఆశతో ఉన్న వారికిఎదురుచూపులు తప్పడం లేదు. వీలైనంత త్వరగ సాయం అందిస్తే చేదోడు వాదోడుగా ఉంటుందని బాధిత కుటుంబాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం మొదటి, రెండో దశల్లో దాదాపు 5 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 2,500 మందికి పైగా మరణించారు. అనధికారికంగా మరో 5వేల మందికి పైగానే మృతిచెంది ఉంటారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 1.5లక్షల మంది కరోనా బారిన పడగా, 450 మంది మరణించారు. నారాయణపేట జిల్లాలో 99వేల మందికి కరోనా రాగా, 311 మృతిచెందారు. గద్వాల జిల్లాలో 87 వేల మంది కరోనా బారిన పడగా, 271 మంది మరణించారు. వనపర్తి జిల్లాలో 93 వేల మందికి కరోనాతో ఇబ్బంది పడగా, 311మంది చనిపోయారు. నాగర్‌కర్నూల్‌లో 1.15లక్షల మందికి కరోనా ప్రబలగా, 500 మందిని వైరస్ కబళించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం చేసి కుటుంబాలను ఆదుకుంటామని మూడు నెలల కిందట ప్రకటన చేసింది. ఆర్థిక సహాయం కోసం గద్వాలలో 271, వనపర్తిలో 311 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వైద్య పరీక్షల నిర్ధారణ ధ్రువీకరణ పత్రాలు తీసుకుని కలెక్టర్ కార్యాలయానికి పంపారు. నెలలు గడుస్తున్నా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేయలేదు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు వారి పిల్లలను గురుకుల పాఠశాలలో చేర్పించి ఉన్నత విద్యనందించేలా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.
దరఖాస్తులు కలెక్టర్‌కు పంపుతున్నాం
కరోనా మృతుల కుటుంబాల నుంచి ఆర్థిక సాయం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. వీటన్నిటిని ఎప్పటికప్పుడు కలెక్టర్‌కు పంపిస్తున్నాం. అర్హులందరికీ ప్రభుత్వ సాయం అందుతుంది. ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలి.
- సుధాకర్ లాల్, జిల్లా వైద్యాధికారి, నాగర్‌కర్నూల్
ప్రతి కుటుంబాన్నీ ఆదుకోవాలి
కరోనాతో మృతిచెందిన ప్రతి కుటుంబాన్నీ ప్రభుత్వం ఆదుకోవాలి. కరోనా బాధిత కుటుంబాల పట్ల వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు. వీరికి ఆర్థిక సాయంతో పాటు పిల్లల చదువులకయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరించాలి.
- ఎ.రాములు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, మహబూబ్‌నగర్