Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులు బిచ్చగాళ్లు కాదు
- ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయాలు
- రాష్ట్రంలో రైతుల కన్నీళ్లు.. గోవాలో టీఆర్ఎస్ చిందులు
- రైతు ధర్మాగ్రహ దీక్షలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోడీ పాలనలో దేశం లూటీ అవుతున్నదనీ, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయని వామపక్షాలు, టీజేఎస్, టీడీపీ నేతలు, పలు రైతు సంఘాల నాయకులు విమర్శించారు. రాష్ట్రంలో రైతులు కల్లాల్లో కన్నీళ్లు కారుస్తుంటే.. టీఆర్ఎస్ నాయకులు గోవాలో చిందులేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కొదండరాం అధ్యక్షతన రైతు దర్మాగ్రహ దీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ వెంకటేశ్వరరావు, న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రసంగించారు. ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ డి నర్సింహారెడ్డి కూడా మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ డ్రామాలను వారు తీవ్రంగా విమర్శించారు. రైతుల ఆవేదనను పట్టించుకోని పాలకుల వైఫల్యాలను ఎండగట్టారు. రైతులు కల్లాల్లోనే కన్నుమూస్తున్నా బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు స్పందించకపోవటం దారుణమని వారన్నారు. ఇప్పటికైనా స్పందించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టటం ద్వారా రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వారు తెలిపారు.
జూలకంటి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర పాలకులు ఎన్నికల సందర్భంలో ప్రజలకూ, రైతులకు అనేక వాగ్దానాలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్లచట్టాలను తీసుకొచ్చి, వందల మంది రైతుల చావుకి కారణమైందని విమర్శించారు. మరో పక్క కార్మిక హక్కులను కాలరాసే విధంగా చట్టాలను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. బీజేపీ సర్కార్ ఇలా అన్ని రకాలుగా దేశాన్ని సర్వనాశనం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు విషయంలో రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రికి రైతుల పట్ల ఏ మాత్రం ప్రేమ ఉన్నా..ధాన్యం కొనుగోలుకు రూ. 10వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత అఖిపక్షాన్ని కలుపుకుని కేంద్రంపై పోరాటం చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని డిమాండ్ చేశారు.
చాడ మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు పాలకులు సున్నం పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకుల విధానాలు తిరోగమనం వైపు పోతున్నాయని చెప్పారు.రాజ్యాంగ ఉల్లంఘనలకు మోడీ సర్కార్ పాల్పడు తున్నదని వివరించారు.ప్రభుత్వ రంగాలన్నింటినీ కార్పొరేట్ల ప్రయోజనాలకు మోడీ ప్రభుత్వం తాకట్టు పెడుతున్నదని చెప్పారు.రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు.సాధినేని మాట్లాడుతూ..ప్రజల ఓట్లకు పుట్టిన పాలకులు..ఇప్పుడు ప్రజలను తిప్పల పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో వారు పచ్చి అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు.రంగారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాలు కట్టిపెట్టాలని సూచించారు.పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.రైతాంగ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహి ంచాలని పిలుపునిచ్చారు. కోదండరామ్ మాట్లాడుతూ వానాకాలం పంటతో పాటు రాబోయే యాసంగి పంటను కచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పాలకులు వరి వేయొద్దనటం సరికాదని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. పాలకులకే ఉరి వేసేందుకు అన్నదాతలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
ధాన్యం సమస్యకు టీఆర్ఎస్, బీజేపీ మధ్య లొల్లే కారణం-సారంపల్లి
సారంపల్లి మాట్లాడుతూ..ఏడాది కాలంగా రైతులు చేసిన పోరాటం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని చెప్పారు. ఈ పోరాటంలో సుమారు 700మంది రైతులు చనిపోయారన్నారు. 12 మంది మేధావులు పోరాట కేంద్రాల వద్దనే ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. 40వేల మందిపై తప్పుడు కేసులు బనాయించారన్నారు. రాష్ట్రంలో ధాన్యం అమ్ముకోవటం కోసం రైతులు నెలల తరబడి కల్లాల్లో పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవంగా పండిన ధాన్యాన్ని నిల్వబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామా?అంటే..అదేమి లేదని చెప్పారు. దేశంలో ఈ ఏడాది 12 కోట్ల 20లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అయిందని లెక్కలతో సహా వివరించారు. తెలంగాణలో 60లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అయిందన్నారు. గత యాసంగిలో కూడా 90లక్షల టన్నులు బియ్యం ఉత్పత్తి అయిందన్నారు. ఇవన్నీ కలిపినా.. పన్నేండున్నర కోట్ల టన్నులకు మించి ఉత్పత్తి కాలేదన్న విషయం అర్థమవుతుందని చెప్పారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఈ పన్నెండు కోట్ల బియ్యం ఎట్లా మిగులుతుందో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎఫ్‌సీఐ ఆరు కోట్ల టన్నులు సేకరించిందన్నారు.. కోటీ 20లక్షల టన్నులు బఫర్ స్టాక్ పెడతారనీ, మూడున్నర కోట్ల టన్నులు చౌక డిపోల ద్వారా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఇందులోంచి తెలంగాణకు కూడా 22లక్షల టన్నులు ఇస్తున్నారని చెప్పారు. మిగిలిన కోటీ 20లక్షల టన్నులను ఎగుమతి చేస్తున్నామని గుర్తుచేశారు. వాస్తవంగా ధాన్యం కొనుగోలు గొడవ ఒక్క తెలంగాణలోనే జరుగుతుందని వివరించారు. దీని వెనుక రాజకీయం ఉందని వివరించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వడ్ల కొనుగోలు రూపంలో బైటపడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, నాయకులు వీఎస్‌బోస్, న్యూడెమోక్రసీ కార్యదర్శి వర్గ సభ్యులు కె రమ, కె గోవర్దన్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, ఏఐకెఎంఎస్ కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు, వి కోటేశ్వర్రావు, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల అసంతృప్తిని తప్పించుకునేందుకే..: ప్రొఫెసర్ నాగేశ్వర్
రాబోయే కాలంలో రైతుల నుంచి వచ్చే అసంతృప్తిని తప్పించుకునేందుకే బీజేపీ, టీఆర్ఎస్ లు డ్రామాలాడుతున్నాయని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు. యాసంగిలో మరింత పెద్ద ఎత్తున వడ్లు వచ్చే అవకాశముండటంతో రైతుల నుంచి మరింత నిరసన సెగలు పెరిగే అవకాశముందని ఆయన చెప్పారు. కొనుగోలు చేయని నేరం తమది కాదంటే తమది కాదని చెప్పుకునేందుకే బీజేపీ, టీఆర్ఎస్లు తాపత్రాయపడుతున్నాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒత్తిడి మేరకు కేంద్రం ప్రజా పంపిణీ నుంచి తప్పుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నదని అనుమానం వ్యక్తం చేశారు. బాయిల్డ్ రైస్ కొనబోమనీ కేంద్రం చెబితే ఒప్పుకుంటూ టీఆర్ఎస్ సంతకం చేసిందని గుర్తుచేశారు. అదే రోజు అఖిలపక్షం ఎందుకు పెట్టలేదనీ, రోడ్ల మీదికి ఎందుకు రాలేదని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. కేంద్ర విధానాలపై టీఆర్ఎస్ నికరంగా నిలబడలేదని తెలిపారు. ఈ ఏడాదికైనా యాసంగి వడ్లు కొనేందుకు ముందుకు రావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
శాశ్వత పరిష్కారం కోసం పోరాడాలి : ప్రొఫెసర్ డి.నర్సింహారెడ్డి
ధాన్యం కొనుగోలు సమస్య తాత్కాలికం కాదనీ, దీనికి శాశ్వత పరిష్కారం దొరికే విధంగా పోరాటం చేయాలని ప్రొఫెసర్ డి.నర్సింహారెడ్డి సూచించారు. వరి మిగులు వచ్చిన సందర్భాల్లోనూ కొనుగోలు చేశారనీ, అయితే గతేడాది నుంచే ప్రభుత్వాలు మొండికేస్తున్నాయని గుర్తుచేశారు. మిగులు ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వ విధానాలుండాలని డిమాండ్ చేశారు.
ఐక్య పోరాటాలతోనే సాద్యం : ప్రొఫెసర్ హరగోపాల్
మార్కెట్‌ను వ్యతిరేకించే రాజకీయ పార్టీలు, సంఘాలు ఐక్య పోరాటాన్ని తీవ్రతరం చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ సూచించారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు తర్వాత ఈ దేశాన్ని మరో 50 ఏండ్ల వరకు ఎవరూ బాగు చేయలేరంటూ కార్పొరేట్ సిద్ధాంతకర్తలు ఉలికి పడుతున్నారని విమర్శించారు. ఎకనామిక్ టైమ్స్ దినపత్రిక ఏదో ధ్వంసం జరిగినట్టుగా సంపాదకీయం రాసిందనీ, దాన్ని వ్యతిరేకిస్తూ తాను లేఖ రాశానని తెలిపారు. అయితే ఆ లేఖలో తాను కార్పొరేట్ ను సమర్థించినట్టు మార్పులు చేసి ప్రచురించారని తెలిపారు. మన దేశానికి ఇప్పుడు మానవీయ అభివృద్ధి నమూనా కావాలని ఆయన ఆకాంక్షించారు.