Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉద్యోగుల విభజన
- సీనియార్టీ ప్రకారమే శాశ్వత కేటాయింపులు
- నూతన జిల్లాల స్థానికతను పట్టించుకోని సర్కారు
- హైదరాబాద్‌కు దగ్గరగా ఉండే ప్రాంతాలకు ప్రాధాన్యం
- ఉమ్మడి జిల్లా కేంద్రాలకు ఎక్కువ మంది ఆప్షన్
- వేరే జిల్లాకు స్థానికేతరులుగా వెళ్లనున్న జూనియర్లు
- నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'మాది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా. ప్రస్తుతం మా ఊరు కడ్తాల్ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉంది. వనపర్తి జిల్లా మదనాపూర్ మండలం కొన్నూర్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 317 ప్రకారం నేను ఆప్షన్ ఇచ్చినా, స్థానికుడిని అయినా రంగారెడ్డి జిల్లాకు వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే సీనియార్టీకి ప్రాధాన్యత ఉండడంతో నేను వేరే జిల్లాకు స్థానికేతరుడిగా వెళ్లాలి. అక్కడే నా 20 ఏండ్ల సర్వీసు మొత్తం పనిచేయాలి. నా పిల్లల స్థానికత మారుతుంది. స్థానికేతరులు మా జిల్లాలో స్థానికులుగా మారతారు. ఇది ఎంత వరకు సమంజసం. ఇది న్యాయమేనా?. ప్రభుత్వం ఆలోచించాలి'అని గుడిగ చంద్రయ్య అన్నారు.
'మాది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. ప్రస్తుతం మా ఊరు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఉన్నది. నాకు 2019లో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఉద్యోగుల విభజన జరుగుతున్నది. కానీ అది స్థానికత ఆధారంగా జరగడం లేదు. సీనియార్టీకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నాకు అన్యాయం జరుగుతుంది. స్థానికేతరులే ఎక్కువ మంది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోకి వచ్చే అవకాశమున్నది. నన్ను వికారాబాద్ జిల్లాకు కేటాయిస్తారు. స్థానికతను ప్రామాణికంగా తీసుకుని ఉద్యోగుల విభజన చేపట్టాలి'అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఉపాధ్యాయుడు చెప్పారు.
'నూతన జిల్లాల స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలి. అలా కాకుండా సీనియార్టీకే ప్రాధాన్యత ఇస్తే స్థానికులుగా ఉన్న జూనియర్ల తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. పాత జిల్లా సీనియార్టీని ప్రామాణికంగా తీసుకోవడం సరైంది కాదు. దానివల్ల స్థానికులు వేరే జిల్లా స్థానికేతరులుగా వెళ్తారు. స్థానిక, స్థానికేతర సమస్య తలెత్తుతుంది. దీన్ని ప్రభుత్వం పరిష్కరించాలి.'అని జెడ్పీహెచ్ఎస్, మాదారం గ్రామం , నాగర్‌కర్నూల్ జిల్ల్లాకు చెందిన జి నర్సింహులు అన్నారు. ఇలాంటి ఆవేదన రాష్ట్రంలోని ఎక్కువ మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో కలుగుతున్నది. ముల్కీ ఉద్యమం నుంచి మొదలుకుని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు స్థానికులు, స్థానికేతరులు అనే అంశంపైనే అవి కొనసాగాయి. స్థానికేతరులు వెళ్లిపోవాలనీ, స్థానికులకే న్యాయం దక్కాలం టూ ఉద్యోగ సంఘాల నాయకులు నాడు డిమాండ్ చేశారు. కానీ స్వరాష్ట్రంలోనూ స్థానికులు, స్థానికే తరులు అన్న సమస్య మళ్లీ ముందుకొచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ ఇప్పుడు వేగంగా జరుగుతున్నది. రాష్ట్రంలో సుమారు 3.50 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో 1.08 లక్షల మంది ఉపాధ్యాయులే ఉన్నారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి అన్ని శాఖల ఉన్నతాధికారులు దీనిపైనే నిమగమై పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6న విడుదల చేసిన జీవో నెంబర్ 317 అసంబద్ధంగా, హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. స్థానికతకే ప్రాధాన్యత ఇస్తున్నామంటూ రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే 95 శాతం కొలువులు స్థానికులకే దక్కుతాయంటూ 2018, ఆగస్టు 30న జీవో నెంబర్ 124ను జారీ చేసింది. ఇప్పుడు ఉద్యోగుల విభజనకు మాత్రం స్థానికతను ప్రామాణికంగా తీసుకోలేదు. అంటే రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రభుత్వం పట్టించుకోలేదని అర్థమవుతున్నది. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలను విభజించింది. కానీ ఉద్యోగుల విభజనకు మాత్రం నూతన జిల్లా స్థానికతను పరిగణనలోకి తీసుకోలేదు. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివిన జిల్లాలోనూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆ జిల్లాకు స్థానికులుగా ఉండే అవకాశం లేదు. ఉమ్మడి జిల్లా సీనియార్టీ ప్రకారమే కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల విభజన జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో స్థానికులు, స్థానికేతరుల సమస్య ఉత్పన్నమవుతుంది. దీనిపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల సీనియర్లకే ప్రయోజనం కలుగుతుందనీ, జూనియర్లకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తున్నదని విమర్శిస్తున్నారు.
సొంత జిల్లాకు స్థానికేతరులు...
రాష్ట్ర ప్రభుత్వం సీనియార్టీకి ప్రాతిపదికగా తీసుకుని ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపడుతున్నది. ఉదాహరణకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఐదు జిల్లాలుగా విభజించబడింది. కొన్ని మండలాలు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ కలిశాయి. అంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సీనియర్ ఉపాధ్యాయుడు ఏడు కొత్త జిల్లాలకు ఆప్షన్ ఇచ్చేందుకు అవకాశమున్నది. సీనియార్టీ ప్రకారమైతే రంగారెడ్ది, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు. రంగారెడ్డిలో స్థానికులైనా జూనియర్లయితే నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట్‌కు స్థానికేతరులుగా వెళ్లాల్సి ఉంటుంది. శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాత ఆ ఉద్యోగి సొంత జిల్లాకు స్థానికేతరులుగా మారిపోతారు.
ఇలా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. ఇక ఎక్కువ మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు హైదరాబాద్‌కు దగ్గరగా ఉండే జిల్లాలకు వచ్చేందుకు ఆప్షన్ ఇస్తారు. సీనియార్టీ ఉన్నోళ్లు ఆ జిల్లా స్థానికులుగా మారిపోతారు. పుట్టిన ఊరు, విద్యాభ్యాసం, తల్లిదండ్రుల నివాసం ఉన్నా సీనియార్టీ లేకపోవడం వల్ల లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేరే జిల్లాలో స్థానికేతరులుగా మారే ప్రమాదమున్నది. ఇంకోవైపు పిల్లల చదువులు, వైద్యంతోపాటు ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)ను ప్రామాణికంగా తీసుకుని ఎక్కువ మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉమ్మడి జిల్లాల కేంద్రాలకు ఆప్షన్ ఇచ్చే అవకాశమున్నది. దీని ప్రకారం ఉమ్మడి రంగారెడ్డి ఉద్యోగులు మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ ఉద్యోగులు యాదాద్రి భువనగిరి, నల్లగొండ, ఉమ్మడి వరంగల్ ఉద్యోగులు హనుమకొండ, జనగామ, వరంగల్, ఉమ్మడి మెదక్ ఉద్యోగులు సంగారెడ్డి, సిద్ధిపేట, ఉమ్మడి నిజామాబాద్ ఉద్యోగులు నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ ఉద్యోగులు కరీంనగర్, పెద్దపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్ ఉద్యోగులు మంచిర్యాలకు ఆప్షన్ ఇచ్చే అవకాశమున్నది. ఈ కారణం వల్ల స్థానికత ఉన్నా జూనియర్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదమున్నది.
స్థానికతతోపాటు సీనియార్టీని పరిగణించాలి : చావ రవి, టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి
సీనియార్టీతోపాటు స్థానికత, ఖాళీల దామాషానూ పరిగణనలోకి తీసుకుని నూతన జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెంబర్ 317లో స్థానిక క్యాడర్లలో ఉద్యోగుల కేటాయింపునకు సీనియార్టీని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం సరైంది కాదు. టీచర్లకు ఫైనల్ సీనియార్టీ లిస్టును తయారు చేయాలి. ముసాయిదా రూపొందించి ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి. ఆ తర్వాత తుది జాబితాను ప్రకటించి విభజన చేపట్టాలి. హడావుడిగా ఆప్షన్లు ఇచ్చి కేటాయింపులు చేస్తే జూనియర్ టీచర్లకు అన్యాయం జరుగుతుంది.
స్థానికత ఆధారంగా చేయకపోవడం సరికాదు : జి సదానందంగౌడ్, ఎస్టీయూటీఎస్ అధ్యక్షులు
స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేయకపోవడం సరైంది కాదు. అసలు ఈ అంశాన్నే ప్రభుత్వం పక్కన పెట్టింది. సీనియార్టీ దెబ్బతినకుండా స్థానికత ఆధారంగా విభజన ప్రక్రియ ఉండాలి. ప్రభుత్వ తీరువల్ల ఉపాధ్యాయుల్లో గందరగోళం ఏర్పడింది. సమస్యలను పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలి.