Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధులు బహిష్కరించి నిరసన
- కేంద్రం తీరుపై కదంతొక్కిన కార్మిక సంఘాలు
- బీజేపీ నిర్ణయాన్ని తిప్పికొట్టాలి.. బొగ్గు గనులను కాపాడుకోవాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు
- చర్చలు విఫలం.. కొనసాగనున్న సమ్మె
నవతెలంగాణ- యంత్రాంగం
తెలంగాణలోని 4 బొగ్గు బ్లాకులను వేలంలో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సింగరేణి 72గంటల సమ్మెలో భాగంగా మొదటిరోజు గురువారం ఉత్పత్తి నిలిపివేసిన కార్మికులు.. సంపూర్ణంగా సమ్మెలోకి వెళ్లారు. రూ.65కోట్లు బొగ్గు అన్వేషణ పనులకు, మౌలిక వసతుల కోసం మరో రూ.1200కోట్లు ఖర్చుచేసి ఏర్పాటుచేసిన శ్రావణ్‌పల్లి, కళ్యాణ్ఖని,సత్తుపల్లి, కోయగూడెం బొగ్గు గనులను వేలంపాట పెట్టడంపై కార్మిక వర్గం మండిపడింది. సింగరేణి గుర్తింపు యూనియన్ టీబీజీకేఎస్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ), సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్‌టీయూసీి), సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ), సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ (హెచ్ఎంఎస్), సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఫ్‌ు (బీఎంఎస్) తో పాటు విప్లవ కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. కాగా, సమ్మెపై కార్మిక సంఘాల నాయకులతో సింగరేణి యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దాంతో సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు, కోయగూడెం, మణుగూరు, ఖమ్మం జిల్లా పరిధిలోని సత్తుపల్లి భూగర్భ, ఉపరితల గనుల్లో (ఓసీ) బొగ్గు ఉత్పత్తి పనులు నిలిచిపోయాయి. సుమారు 6వేల మంది సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె సందర్భంగా విధులకు వచ్చే అధికారులను కార్మికులు అడ్డుకున్నారు. సింగరేణి వ్యాప్తంగా ఓపెన్ కాస్ట్, భూగర్భ గనులలో బొగ్గు పెల్లా కూడా బయటికి రాలేదు. 1.20 లక్ష టన్నుల బొగ్గు నిలిచిపోయింది. కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కార్మిక సంఘాలు నిర్వహించిన ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు పాల్గొని మాట్లాడారు. ఈనెల 13న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు చట్టం ద్వారా సింగరేణిలోని 4 బొగ్గు బ్లాకులు ప్రయివేటుపరం చేయడానికి పూనుకుందనీ, దాన్ని అడ్డుకోకపోతే కార్మికులకు మనుగడ ఉండదని హెచ్చరిం చారు. బొగ్గును ప్రయివేటుపరం చేస్తే సిమెంట్, విద్యుత్, ఎరువులు అందుబాటులో ఉండవనీ, వ్యవసాయం, విద్యుత్ ప్రయివేటు శక్తుల్లోకి వెళుతుందని తెలిపారు. బొగ్గు బ్లాకుల పరిరక్షణకు అన్ని కార్మిక సంఘాలు కలిసి రావడం శుభసూచకం అన్నారు. 9 ఏండ్లుగా కార్మికులకు జేబీసీసీఐ ఒప్పంద వేతనాలు ఇవ్వడం లేదనీ, ఈ కాలంలో కాంట్రాక్టు కార్మికులు రూ.18 వేల కోట్లు నష్టపోయారని తెలిపారు. సమ్మెలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రగాని కఋష్ణయ్య, ఎంవీ. అప్పారావు, ఎం.చంద్రశేఖర్, జి.శ్యామ్ కుమార్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లాలో సమ్మె వల్ల సింగరేణి వ్యాప్తంగా 2.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అత్యవసర సిబ్బంది మినహా 42 వేల మంది కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. నాలుగు ఓసీపీ గనులు, 6 భూగర్భ గనుల నుంచి ఒక్క బొగ్గు పెళ్ల కూడా ఉత్పత్తి జరగలేదు. కార్మిక నాయకులు, కార్మికులు ఆయా సంఘాల కార్యకర్తలతో బొగ్గు గనుల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తెల్లవారు జామున ప్రారంభమయ్యే ప్రీ షిప్ట్ కార్మికులు విధులకు హాజరు కాకుండా కార్మిక సంఘాల నాయకులు గనులపై పర్యవేక్షించారు. సింగరేణి అధికారుల సంఘం కూడా సమ్మెకు మద్దతు ఇవ్వడంతో ఓపెన్ కాస్ట్ కార్మికులతో బలవంతంగా పనులు చేయించే ప్రక్రియకు దూరంగా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని సింగరేణిలో ఉన్న 45గనులు, 19 ఓసీపీలు, 25 భూగర్భ కేంద్రాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణిలో కార్మికులంతా విధులకు దూరంగా ఉన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో కార్మికులతో పాటు సింగరేణి భవిష్యత్తు అందకారమవుతుందన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కుదరని అంగీకారం.. సమ్మె యధాతథం
కార్మిక సంఘాలకు సింగరేణి యాజమాన్యానికి మధ్య గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆర్ఎల్సీ కార్యాలయంలో జరిగిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండా వాయిదా పడ్డాయి. తెలంగాణలోని 4 బొగ్గు బ్లాకుల వేలంపాట రద్దు చేయాలనీ, మరో 11 డిమాండ్లను జోడించి ఐదు జాతీయ కార్మిక సంఘాలు, సింగరేణి గుర్తింపు యూనియన్ టీబీజీకేఎస్ జారీచేసిన సమ్మె నోటీస్‌పై రెండో దఫా చర్చలు జరిగాయి. బొగ్గు బ్లాకుల వేలంపాట రద్దు చేయడం సింగరేణి యాజమాన్యం పరిధిలో లేనందున తక్షణమే సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని యాజమాన్యం కార్మిక సంఘాలను కోరింది. మిగతా 11డిమాండ్లపై చర్చించాలని కార్మిక సంఘాలు పట్టుపట్టాయి. యాజమాన్యం కార్మిక సంఘాలు జారీచేసిన సమ్మె నోటీస్‌పై లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చింది. వీటిలో అనేక డిమాండ్లను పరిశీలిస్తామని హామీ ఇచ్చింది, మరికొన్ని తమ పరిధిలో లేవని తేల్చిచెప్పింది. అమలులో ఉన్న స్టాండింగ్ ఆర్డర్స్ ఆధారంగా క్రమశిక్షణ చర్యలు చేపట్టామని వివరించారు. కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలను సింగరేణి సంస్థ అమలు చేయలేమని చెప్పారు. కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసులోని ఒక్క డిమాండ్ కూడా యాజమాన్యం అమలు చేయడానికి సిద్ధపడటం లేదని కార్మిక నాయకులు మండిపడ్డారు. యాజమాన్యం డిమాండ్ల పరిష్కారానికి ముందుకు రానప్పుడు చర్చలు జరపడం అర్థం లేదని కార్మిక సంఘాలు తెలిపాయి. ఆర్ఎల్సీ జోక్యంతో చర్చలను శుక్రవారం కొనసాగించాలని నిర్ణయించారు. యాజమాన్యం డిమాండ్ల పరిష్కారానికి ముందుకు రాకపోవడంతో సమ్మె కొనసాగించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. చర్చల్లో కార్మిక నాయకులు సీఐటీయూ నాయకులు మందా నరసింహారావు, తుమ్మల రాజారెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు బి.వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, ఏఐటీయూసీ నాయకులు సీతారామయ్య, రాజ్ కుమార్, ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్, నరసింహారెడ్డి, బీఎంఎస్ నాయకులు పులి రాజారెడ్డి, యాదగిరి సత్తయ్య, హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్, యాజమాన్యం పక్షాన డైరెక్టర్ పా ఎస్ బలరాం, సీఎం పర్సనల్ ఆనందరావు హాజరయ్యారు.