Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు జైళ్ల శాఖాధికారుల సస్పెన్షన్
- ఆదేశాలు జారీ చేసిన జైళ్ల శాఖ ఇన్చార్జీ డీజీ జితేందర్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
జైళ్ల శాఖలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ సంబంధిత శాఖ ఇన్చార్జీ డీజీ జితేందర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జైలుకు చెందిన ఇద్దరు జైలర్లు రామకృష్ణా రెడ్డి, ఆనంద్‌రావు, మరో డిప్యూటీ జైలర్ రాజ్‌కుమార్‌తో పాటు వార్డర్ జైరాం లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఒక ఖైదీ నుంచి అతనికి సహకరించడానికిగానూ పెద్ద మొత్తంలో వీరు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దాని ద్వారా వీరిలో ఒక అధికారి కారును తీసుకోగా, మరొకరు బుల్లెట్ బైక్‌ను తీసుకున్నట్టు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. అంతేగాక, గతంలో పలుమార్లు వీరు ఖైదీల నుంచి ముడుపులు తీసుకున్నట్టుగా కూడా ఆరోపణలున్నాయి. వీటన్నిటిపై డీజీ జితేందర్ ఆదేశాల మేరకు జైళ్ల శాఖ డీఐజీ మురళీబాబు రంగంలోకి దిగి విచారణ జరిపారు. విచారణలో పై నలుగురు అధికారులపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలినట్టు సమాచారం. ఈ మేరకు మురళీబాబు ఇచ్చిన నివేదిక ఆధారంగా రామకృష్ణా రెడ్డి, ఆనంద్‌రావ్, రాజ్‌కుమార్, జైరాం లను సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీ ఆదేశాలు జారీ చేశారు.