Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యారోగ్య శాఖలోని కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలి
- ఉద్యోగ భద్రత కల్పించాలి : టీయూఎమ్హెచ్ఈయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వైద్యవిధాన పరిషత్, వైద్యవిద్య విభాగం పరిధిలోని ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, జిల్లా, ఏరియాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపాల్, కె.యాదానాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీతాల పెంపు, ఉద్యోగ భద్రత, తదితర సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మికులను కోరారు. సమస్యలపై శుక్రవారం వైద్యవిద్య, వైద్య విధాన పరిషత్ కమిషనర్ రమేశ్‌రెడ్డికి వారు మెయిల్ ద్వారా వినతిపత్రాన్ని పంపారు. ఏఒక్క కార్మికునికి కూడా రూ.7 వేల నుంచి 9 వేలకు మించి వేతనం ఇవ్వడం లేదని వారు వాపోయారు. ఆస్పత్రుల్లో రోగుల సహాయకులు, శానిటైజేషన్, సెక్యూరిటీ, కీపింగ్ విభాగాల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీవో నెంబర్ 60 ద్వారా వేతనాలు పెంచుతామని చెప్పినా అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ, సెలవులు, రక్షణ సౌకర్యాలు సరిగ్గా కల్పించడం లేదని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆస్పత్రుల్లో పనిచేసే కార్మికులకు జీవో నెంబర్ 68 ప్రకారం వేతనాలివ్వాలంటూ కార్మిక శాఖ ఆదేశాలిచ్చినా.. అవి బుట్టదాఖలయ్యాయని పేర్కొన్నారు. అనంతరం జారీ అయిన జీవో నెంబర్ 306 ప్రకారం ప్రతి కాంట్రాక్టు కార్మికునికి కనీసం రూ.16 వేల వేతనం ఇవ్వాలని తెలిపారు. అయితే, నిమ్స్‌లోని కొన్ని విభాగాల్లోనే ఈ వేతనం అమలవుతున్నదని పేర్కొన్నారు. ఇలా ఒకే రాష్ట్రంలో పనిచేసే కార్మికులకు వేర్వేరుగా జీతాలు అమలు కావడమేంటని ప్రశ్నించారు. సిబ్బందికి ప్రతిరోజూ సరిపడ శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లు ఇవ్వాలని కోరారు. థర్డ్‌పార్టీ కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలనీ, మ్యాన్ పవర్ నిర్వహణను ఆస్పత్రుల్లోన్ని అధికారులకు అప్పగించి కాంట్రాక్టర్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.