Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏజెన్సీ ప్రాంత చట్టాలను కాలరాసే ప్రయత్నం : టీఎస్‌టీటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవోనెంబర్ 317లోని లోపాలను సవరించకుంటే అడ్డుకుంటామని టీఎస్‌టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్‌నాయక్ హెచ్చరించారు. అనేక సాంకేతిక లోపాలతో ఈ జీవో ఉన్నందున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏజెన్సీ ప్రాంత చట్టాలను కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. భారత రాజ్యాంగం గిరిజనులకు కొన్ని ప్రత్యేక చట్టాలు కల్పించిందని పేర్కొన్నారు. ఏజెన్సీ, మైదాన ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోకుండా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఉద్యోగుల విభజన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. స్థానికతపై స్పష్టత లేదని వివరించారు. సీనియర్లకు న్యాయం జరగడం కోసం బలవంతంగా ఆప్షన్లు ఇవ్వాలంటూ చెప్పడమెంటనీ ప్రశ్నించారు. జూనియర్లను బలవంతంగా వారి ఇష్టానికి వ్యతిరేకంగా వేరే స్థానానికి పంపించేందుకు కుట్ర జరుగుతున్నదని తెలిపారు.
కొత్త జీవో జారీ చేయాలి : టీఎస్పీటీఏ
ఉద్యోగుల శాశ్వత కేటాయింపులు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అసంబద్ధమైన జీవో నెంబర్ 317ను జారీ చేసిందని టీఎస్పీటీఏ అధ్యక్షులు సయ్యద్ షౌకత్‌అలీ, ప్రధాన కార్యదర్శి ఎన్ చెన్నరాములు తెలిపారు. ఆ జీవోను రద్దు చేసి కొత్త ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చించాలని కోరారు. కీలకమైన అంశంపై ఉత్తర్వులు జారీ చేసేముందు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం ఉన్న సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపడం అనివార్యమని తెలిపారు. ఆ ఆనవాయితీని ప్రభుత్వం తుంగలో తొక్కి అనుకూలంగా ఉన్న సంఘాలతో నామమాత్రంగా చర్చించి ఉద్యోగుల ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఆదేశాలు జారీ చేసిందని విమర్శించారు. రాష్ట్ర ఏర్పాటుకు స్థానికతే కీలకమనీ, దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం రహస్య ఎజెండా అమలు చేయాలనే విధానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ద్వారా సంక్రమించిన సమానత్వపు హక్కును నిరాకరించడమేనని తెలిపారు. ప్రభుత్వం ముందుకెళ్తే హైకోర్టులో సవాల్ చేస్తామని హెచ్చరించారు.
బలవంతపు విభజన వద్దు : సీపీఎస్‌టీఈఏ
బలవంతపు ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టొద్దని సీపీఎస్‌టీఈఏ అధ్యక్షులు దాముక కమలాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు కోరుకున్న జిల్లాలకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అవసరమైతే సూపర్‌న్యూమరరీ పోస్టులను సృష్టించాలని సూచించారు. బలవంతంగా పంపిస్తే వారి పిల్లల స్థానికత పూర్తిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఉద్యోగి ఉద్యోగ విరమణ వరకు కొత్త జిల్లాలోనే పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న ఉద్యోగులను బదిలీ చేస్తే వారి కుటుంబ పరిస్థితి దయనీయంగా మారుతుందని పేర్కొన్నారు.
స్థానికత, సీనియార్టీ పరిగణనలోకి తీసుకోవాలి : తపస్
ఉపాధ్యాయుల కేటాయింపులను నూతన జిల్లా స్థానికత ఆధారంగా సీనియార్టీని పరిగణనలోకి చేపట్టాలని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ డిమాండ్ చేశారు. ఆప్షన్ల కన్నా ముందే జిల్లాల వారీగా అన్ని క్యాడర్లకు చెందిన పోస్టులు, పనిచేస్తున్న వారు, ఖాళీలను ప్రకటించాలని కోరారు. భార్యాభర్తల కేటగిరీ వారు ఒకే జిల్లాలో ఉండేందుకు ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వాలని సూచించారు.