Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళ ధర్నా
- ప్రజాసంఘాల నాయకుల మద్దతు
నవతెలంగాణ - అడ్డగూడూర్
తన గుడిసెను కూల్చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఎరుకల సామాజిక తరగతికి చెందిన ఓ మహిళ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం జరిగింది. ఎరుకల సామాజిక తరగతికి చెందిన బెల్లంకొండ సోమక్క మండల కేంద్రంలో కొంత ఇంటి స్థలం కొనుక్కుని గుడిసె వేసుకుంది. అయితే, ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ఆమె ఇంటిని కూల్చేశారు. దాంతో బాధితురాలు సోమక్క తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసింది. ఆమెకు పలు రాజకీయ పార్టీల నాయకులు, దళిత సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్పీ ఏపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు బట్టు రామచంద్రయ్య మాట్లాడారు. సోమక్క 30 ఏండ్ల కిందట బండారి యాదయ్య, సోమయ్య, రమేష్ తండ్రి సత్తయ్యకు రూ.62 వేలు చెల్లించి 25 గుంటల భూమిని కొనుగోలు చేసిందన్నారు. అందులో గుడిసె వేసుకున్నట్టు చెప్పారు. ఆ భూమిని కబ్జా చేసేందుకు సోమక్కను బండారి యాదయ్య కులం పేరుతో దూషించి, గుడిసె పీకేశారని తెలిపారు. ఎంపీపీ దర్శనాల అంజయ్య.. గుడిసెలు పీకేసిన వారినే ప్రోత్సహిస్తున్నారన్నారు. వారి పైన అట్రాసిటీ చట్టం కింద చర్య తీసుకోవాలని కోరారు. సోమక్క పట్టా భూమి ఖాతా నెంబర్ 402 విస్తీర్ణంలో గల 25 గుంటలు భూమికి కొత్త పాస్ పుస్తకం ఇవ్వాలని, సోమక్కకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని తెలిపారు. అంతకుముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ధర్నాలో బొడ్డుగూడెం గ్రామ ఉపసర్పంచి రేణుక, చెడేపెల్లి రవీందర్, సీపీఐ(ఎం) నాయకులు మండల నాగేశ్వర్రావు, ఏకలవ్య ఎరుకల సంఘం మండల అధ్యక్షులు మానుపాటి అంజయ్య, కాంగ్రెస్ నాయకులు సుక్క దేవయ్య, ఏఐఎస్ఎఫ్ నాయకులు సోమయ్య, సతీష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా కౌన్సిల్ సభ్యులు జానీ, ఎంఎస్ఎఫ్ నాయకులు మందులు వెంకటేష్ పాల్గొన్నారు.