Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినియోగదారుల కమిషన్ జస్టిస్ జైస్వాల్‌ను కలిసిన కన్సూమర్స్ కౌన్సిల్ ప్రతినిధులు
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మెన్ జస్టిస్ ఎన్.ఎస్.కె జైస్వాల్‌ను తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సమన్వయ సమితి ప్రతినిధులు శుక్రవారం హైదరాబాదులోని కమిషన్ కార్యాలయంలో కలిశారు. నూతనంగా రాష్ట్ర కమిటీకి ఎన్నికైన ప్రతినిధులు దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ పల్లెపాడు దామోదర్, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాంబరాజు చక్రపాణి, బూరుగుపల్లి శ్రావణ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యులను చైర్మెన్ జస్టిస్ జైస్వాల్ అభినందించారు. వినియోగదారుల సమస్యలు నానాటికీ పెరిగి పోతున్నాయని, వాటిని పరిష్కరించేందుకు వినియోగదారుల్లో తగిన చైతన్యం రావాలన్నారు. కమిషన్‌లో కేసుల సత్వర పరిష్కారానికి అదనపు బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం, వినియోగదారుల సంఘాలు సమన్వయంతో ముందుకు సాగి వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం పట్ల విస్తత అవగాహన పెంపొందించాలని ప్రతినిధులకు సూచించారు. జస్టిస్ జైస్వాల్‌ను కలిసినవారిలో వినియోగదారుల సమన్వయ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు పరికిపండ్ల వేణు,బొక్క భాస్కరరావు, పెందోట అనిల్, కార్యదర్శులు నల్ల రాజేందర్, ప్రతినిధులు రామారావు, రాము, అంబికా ఢిల్లీ కార్, శ్యామ్ ఉన్నారు.