Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగం కల్పించిన సమాన హక్కుల కోసం పోరాడుదాం: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
- వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ర్యాలీ, సభ
నవతెలంగాణ-ముషీరాబాద్
మహిళా హక్కులపై దాడి, హింసను ప్రతిఘటిద్దామనీ, రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతామని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులపై నేడు దాడి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐద్వా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సుందరయ్య పార్క్ నుంచి వీఎస్టీ వరకు మహిళలపై దాడులు, హింసను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ, అనంతరం సభ నిర్వహించారు. కార్యక్రమానికి ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అర్.అరుణ జ్యోతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటినా మహిళల హక్కులు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు. రాజ్యాంగం కల్పించిన సమాన పనికి సమాన హక్కు, గృహహింస నిరోధక హక్కు, భ్రూణహత్యల నిరోధక హక్కు, లైంగిక వేధింపుల నిరోధక చట్టం, వారసత్వంలో సమాన వాటా హక్కు వంటివి అమలు చేయడంలో పాలకులు విఫలం అవుతున్నారని ఆరోపించారు. సమాజంలో ఇప్పటికీ మహిళలు అణిచివేత, వివక్షత, దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో మహిళల హక్కులపై దాడులు, వేధింపులు, బాలికల అక్రమ రవాణాతో పాటు మహిళల వస్త్రధారణ, ఆహారపు అలవాట్లపై దాడి జరుగుతున్నా అరికట్టే చర్యలు కనిపించడం లేదన్నారు. స్వేచ్ఛÛ, స్వాతంత్ర, సమాన హక్కులతో జీవించాలన్నది ఐక్యరాజ్యసమితి ఆశయమనీ, అందుకనుగుణంగానే మానవ హక్కుల దినోత్సవం ప్రతి ఏడాది నిర్వహించుకుంటున్నామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భావ ప్రకటనా స్వేచ్ఛపై, అభ్యుదయవాదులు, కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయన్నారు. ప్రశ్నిస్తే రాజద్రోహం పేరుతో కేసులు పెడుతున్నారని చెప్పారు. ఉద్యమాల ద్వారా సాధించుకున్న హక్కులు, చట్టాలు నిర్వీర్యం కాకుండా ఉండాలంటే రాజ్యాంగపరమైన హక్కుల పరిరక్షణకు పిడికిలి బిగించి, ప్రతి ఒక్కరం పోరాడాలన్నారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. ఆశాలత, ఎం. వినోద, లక్ష్మమ్మ, నాగలక్ష్మి, నాయకులు సృజన, శశికళ, స్వర్ణలత, శబానా, వరలక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు.