Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మీ
- 5 కిలోమీటర్ల మేర మహాపాదయాత్ర
నవతెలంగాణ-ములుగు
పారితోషికాల జీఓను రద్దు చేసి వెంటనే పీఆర్సీ ప్రకటించి ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనమివ్వాలని తెలంగాణ వాలంటీర్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ యూనియన్ మలుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు జిల్లా కేంద్ర శివారులోని జంగాలపల్లి నుంచి కలెక్టరేట్ వరకు (5 కి.మీ) శుక్రవారం మహాపాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ అధికారి రాజ్ప్రకాష్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జయలక్ష్మీ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆశావర్కర్లకు వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటిస్తూ ఆచరణలో పారితోషికాలే ఇస్తుండటం దుర్మార్గమన్నారు. కరోనా కాలంలో రెండేండ్లపాటు ఎనలేని సేవలు అందించగా ఆశావర్కర్లకు కేంద్ర ప్రభుత్వం నెలకు రూ. వెయ్యి చొప్పున అందించిన నెలసరి ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆశావర్కర్లకు అందించకపోవడం సిగ్గుచేటన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలనీ, పెండింగ్‌లో ఉన్న 16 నెలల రిస్క్ అలవెన్స్‌ను వెంటనే విడుదల చేయాలనీ, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, నాయకులు గుండెబోయిన రవిగౌడ్, మడే రవి, నీలాదేవి, శ్రావ్య, ప్రభావతి, నాగమణి, పాపా, సంధ్య, సుజాత, కవిత, మాధవి, శాంతకుమారి, పూర్ణ, నళిని, చంద్రవని, రజిత, సుధ, భాగ్య, సరిత, శోభ, మమత, కోమల, తదితరులు పాల్గొన్నారు.