Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలు ఆదరించే ఉత్పత్తులపై కేంద్రీకరణ
- కార్పొరేషన్‌కు రూ.5వేల కోట్లు కేటాయించాలి
- కల్లుగీత రాష్ట్ర స్థాయి సెమినార్లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
గీత వృత్తి నైపుణ్యాభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత వృత్తిదారులపై కూడా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'కల్లుగీత వృత్తిలో ఉపాధి- ఆధునీకరణ అవకాశాలు' అనే అంశంపై సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజ్‌గౌడ్ అధ్యక్షతన సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ గీత వృత్తి అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందని చెప్పారు. కానీ..ప్రభుత్వమే అన్నీ చేయాలంటూ ఎదురు చూడకుండా వృత్తిదారుల్లో కూడా తమ నైపుణ్యతను పెరచుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉత్పత్తి వినియోగంలో ఆదునీకత సంతరించుకోవాలన్నారు. గీత వృత్తి ప్రమాదకరమైందనే విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని చెప్పారు. ఈ క్రమంలో వృత్తిదారులు అత్యంత జాగురూకతతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తాటి చెట్టునుంచి 100రకాల ఉత్పత్తుల్ని తీయవచ్చన్నారు. నీరా అసలైన పానియమని చెప్పారు. అందులో ఔషద గుణాలున్నాయని తేలిందని వివరించారు.
కల్లుగీత కార్పొరేషన్‌కు రూ.5వేల కోట్లు కేటాయించాలి : ఎంవీ రమణ
కల్లుగీత కార్పొరేషన్‌కు రూ.5వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ రమణ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. సరళీకరణ విధానాల వల్ల బహుళ జాతి కంపెనీల లిక్కర్, శీతల పానీయాల ధాటికి తట్టుకోలేక కల్లు అమ్మకాలు పడిపోయాయని తెలిపారు.
దీంతో ఉపాధి క్రమంగా దెబ్బతింటున్నదని చెప్పారు. దీంతో వృత్తిదారులు బతుకుదెరువు కోసం ఇతర పనులు వెతుక్కుంటూ పట్టణాల బాట పడుతున్న దుస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు.ఏడేండ్ల కాలంలో 4,500 మంది గీత కార్మికులు ప్రమాదాలకు గురయ్యారని చెప్పారు. వీరిలో 560మంది చనిపోయారన్నారు. ఇంత ప్రమాదకరమైన వృత్తి మరేదైనా ఉందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్యం విధానం సర్కారుకి ఆదాయం పంచుకునే విధంగా ఉందని చెప్పారు. లిక్కర్ తయారీదారులకు, షాపు యజమానులకు లక్షల ఆదాయం వస్తుందని తెలిపారు. ఆరోగ్యానికి మంచిదైన కల్లు అమ్మకాలను అభివృద్ధి చేయటానికి తగిన విధంగా ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సెమినా ర్లో 23 తీర్మానాలు చేసి ప్రభుత్వానికి అందిస్తామనీ, గీత వృత్తి అభివృద్ధికి సర్కారు సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఎండీ ఉదరు ప్రకాశ్, సర్వారుపాపన్న మెమోరియల్ ట్రస్ ్టచైర్మెన్ తాళ్లపల్లి రామస్వామి, ప్రొఫెసర్ గట్టు సత్యనారాయణ, ఐయిలి వెంకన్న, బీమగౌని చంద్రయ్య, లెల్లెల బాలకృష్ణ, బెల్లం కొండ వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు.