Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బియ్యంలో రాళ్లు..
- బుక్క బుక్కకు మట్టిపెళ్లలు
- హాస్టల్లో పెట్టే బువ్వ తినలేని పరిస్థితి
- అమలుకు నోచుకోని కరోనా నిబంధనలు
- గురుకులల్లో చదువుతున్న విద్యార్థుల దీనగాథలు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
''వసతి గృహాల్లో సరిపడా గదులు లేవు.. ఉన్న గదులకు కిటికీలు, డోర్లు లేక రాత్రి పూట చలికి వణికి పోతున్నాం. నేల మీద దుప్పటి వేసుకుని నిద్రపోతున్నాం. పెడుతున్న అన్నంలో మట్టిపెల్లలు వస్తున్నాయని, వంట సిబ్బందిని అడిగితే ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యంలో ఎక్కువగా ఉంటున్నాయని, అవి తీసినా అక్కడక్కడ వస్తున్నాయని సమాధానంతో సరిపెడుతున్నారు. కరోనాతో భయాందోళనకు గురవుతుండటంతో తమకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు.' ఇది రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని గురుకులాల్లోని విద్యార్థుల ఆవేదన. స్నానపుగదులు, మరుగుదొడ్లకు తలుపులు పెట్టించి, నీటి సమస్య లేకుండా చూడాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.
పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు..ఆరోగ్యవంతమైన ఆహారం, మౌలికమైన వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. కానీ ప్రభుత్వం మాత్రం విద్యార్ధులు జీవితాలను గాలికి వదిలేసింది. ఇందుకు నిదర్శనం రంగారెడ్డి జిల్లాలో ఇటీవల గురుకులాల్లో రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి. సరూర్‌నగర్ ప్రాంతంలోని గురుకుల పాఠశాలల్లో కలుషిత నీరు, ఫుడ్ పాయిజన్‌తో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మరువక ముందే షాదర్‌నగర్ ప్రాంతంలో చటన్పల్లిలో బీసీ వెల్ఫేల్ వసతి గృహాంలో రాత్రి పూట ఎలుకలు కరిచిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఘటనలు వసతి గృహాల్లో చోటు చేసుకున్నప్పటికీ.. ఆ ప్రాంతాలను ఇప్పటి వరకు ఉన్నతాధికారులు పరిశీలించకపోవడం గమనార్హం. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో 58 గురుకులాలు ఉండగా ఇందుల్లో 90 శాతం గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఒక్కో గురుకులంలో సుమారు 400 నుంచి 480 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. గురుకులాల్లో సుమారు 18,950 విద్యార్థులు ఉన్నారు. సరూర్‌నగర్ గురుకుల పాఠశాలల్లో 280 మంది విద్యార్థుల ఉండగా, విద్యార్థుల నిష్పత్తికి తగినన్ని గదులు లేవు. తరగతి గదులకు ఉన్న కిటికీలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. ఇక మూత్రశాలలు, మరుగుదొడ్ల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. సరైన తలుపులు లేవు. తరచూ మంచినీటి కొరత ఏర్పడుతోంది. సహార, తుర్కయాంజాల్ గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆటస్థలం లేకపోవడంతో 24 గంటలు నాలుగు గోడల మధ్య పరిమితం కావాల్సి వస్తుందని విద్యార్థులు చెబుతున్నారు.
గురుకులాలకు నాసిరకం బియ్యం
ఒక్కో విద్యార్థికి రోజుకు 500 గ్రాముల రైస్ చొప్పున ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తుంది. ఒక్కో గురుకులంలో రోజుకు సగటున 200 నుంచి 250 కేజీల బియ్యాన్ని వండి విద్యార్థులకు వడ్డించాల్సి వస్తుంది. గురుకులాలకు సరఫరా చేసే బియ్యంలో నూకలతో పాటు ఇసుక ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. నూకలు ఎక్కువగా ఉండటం వల్ల అన్నం ముద్దగా మారి తినడానికి పనికిరాకుండా పోతుంది. ముద్ద, ముద్దకు ఇసుక రాళ్లు తగులుతుండటంతో నమిలి మింగలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గురుకులాల ఉపాధ్యాయులు గుర్తించి, పనిమనుషులతో బియ్యాన్ని జల్లెడ పట్టిస్తున్నారు. ఒక్కో బస్తాకు ఐదారు కేజీల నూకలు, ఇసుక రాళ్లు వెళ్తుండటంతో వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. అంతే కాదు వారంతా పారిశుధ్య పనులు వదిలేసి, బియ్యం నుంచి నూకలు, రాళ్లను వేరు చేసే పనిలో నిమగం కావాల్సి వస్తుంది. గదులను, మరుగుదొడ్లను, మూత్రశాలలను శుభ్రం చేయక పోవడంతో హాస్టళ్లలో పారిశుధ్య లోపం తలెత్తుతోంది. ఇటీవల సరూర్‌నగర్ గురుకులంలో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై, ఆస్పత్రిలో చేరడానికి ఇదీ కూడా ఓ కారణమని విద్యార్థిసంఘాలు అభిప్రాయపడ్డాయి.
నేల మీద పడుకుంటున్నాం
సరిపడా బెడ్లు లేక నేల మీద పడుకుంటున్నాం.. గదిలో కిటికీలు లేక పోవడంతో చల్లటి గాలికి వణుకు పుడుతుంది. రాత్రంత చలికి వణుకుతూ ఉండాల్సివస్తోంది. ప్రిన్సిపాల్‌కు చెబితే బెడ్లు తెప్పిస్తాం. గదులకు కిటికీలు పెట్టిస్తామని చెప్పారు.
- నవీన్, 8వ తరగతి
మరుగు దొడ్లు సక్కగా లేవు
మూత్రశాలలు, మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో బాత్రూమ్కు వెళ్లలేని పరిస్థితి ఉంది. అత్యవసర పరిస్థితిలో ఇబ్బందులు పడుతున్నాం. స్నానం చేయడానికి కూడా నీళ్లు ఉండవు. ఒక్కోరోజు స్నానం చేయకుండనే క్లాస్‌కు వెళ్లుతాం. మా సమస్యను గుర్తించి పరిష్కరించాలి.
- రాజు , 10 వ తరగతి
గురుకులాల్లో మౌలిక వసతులు కల్పించాలి
చలికాలం ప్రారంభమైనా నేటికీ విద్యార్థులకు ఇవ్వాల్సిన దుప్పట్లు పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు. అసౌకర్యంగా ఉన్న అద్దె భవనాల్లో గురుకులాలు నడుపుతుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ప్రభుత్వం గురుకులలకు పక్క భవనాలు నిర్మించాలి. నాణ్యమైన విద్యాతోపాటు, నాణ్యమైన ఆహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- శంకర్, ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి