Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొత్తం ఓట్లు 5326 .. ఓటుకు దూరంగా 157 మంది
- ఓటు వినియోగించుకోని సీఎం కేసీఆర్
- లిస్ట్‌లో పేరు లేక వెనుదిరిగిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్
- ఖమ్మంలో కాంగ్రెస్ నాయకుల అరెస్ట్
- ఎన్నికలకు దూరంగా సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ
- 14న వెలువడనున్న ఫలితాలు
నవతెలంగాణ- విలేకరులు
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం నాలుగ్గంటల వరకు పోలింగ్ జరిగింది. సభ్యులు క్యాంపుల నుంచి నేరుగా బస్సుల్లో పోలింగ్ కేంద్రా లకు చేరుకున్నారు. ఎంపీ బండి సంజరు, సీఎం కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరు ఓటర్ లిస్టులో లేకపోవడంతో వెనుదిరిగారు. పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌గోయల్ పరిశీలించారు. 14వ తేదీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని ఆయన చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్స్ఫిషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మంలో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేయడంతో అరెస్ట్ చేశారు. మొత్తం 5326 మందికిగాను 157 మంది ఓటు వేయలేదు. సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకుగాను 99.70శాతం ఓట్లేశారు. ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన 8 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎక్స్అఫిషియో సభ్యులతో కలిపి 1324 ఓట్లు ఉండగా, 1320 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. క్యాంపుల్లో నుంచి నేరుగా ఆయా పోలింగ్ కేంద్రాలకు బస్సుల్లో చేరిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మధ్యాహ్నం ఓటు వేశారు. కరీంనగర్లో ఎంపీ బండి సంజరు ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఓటేసేందుకు వచ్చిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లిస్టులో పేరు లేకపోవడంతో వెనుదిరిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ లిస్టు సవరణ చేసే సమయానికి ఈటల ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడంతో ఆయన పేరు లిస్టులో నమోదు కాలేదని తెలుస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఎక్స్అఫీషియో సభ్యులు మంత్రి కేటీఆర్ ఓటు వేశారు.
పోలీసులపై మంత్రి గంగుల ఫైర్..
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ పోలింగ్ కేంద్రంలో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు సుంకెరవి, రసమయి బాలకిషన్, మేయర్ సునిల్‌రావు ఓటు వేశారు. ఈ క్రమంలో మంత్రి గంగుల, స్థానిక సంస్థల నేతలు కండువాలు కప్పుకోవడం పట్ల స్వతంత్య్ర అభ్యర్థి, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా మంత్రి వారించి, వాగ్వివాదానికి దిగారు.
మెదక్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలికి 99.22 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,026 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,018 మంది ఓటు వేశారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం కేసీఆర్ ఓటు వేయలేదు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 937మంది ఓటర్లు ఉండగా, 860మంది ఓటు హక్కును వినియోగి ంచుకున్నారు. 91.78శాతం పోలింగ్ నమోదైంది. 77 మంది ఓటు వేయలేదు. నిర్మల్ పోలింగ్ కేంద్రంలో 151మంది ఓటర్లకుగాను అందరూ ఓటు వేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌గోయల్ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 1271 మంది ఓటర్లు ఉన్నారు. 1233 మంది ఓటు వేశారు. 38 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. 97.01 శాతం పోలింగ్ నమోదైంది. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి, భువనగిరిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఓటు హక్కును వినియోగించుకున్నారు.
స్వల్ప ఉద్రిక్తత..
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలు స్వల్ప ఉద్రిక్తత మినహా ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 768 మంది ఓటర్లకుగాను 738 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 96.09 శాతం ఓట్లు పోలయ్యాయి. సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ మంత్రి, ఎమ్మెల్యేలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధిర మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసుపై అరెస్టు వారెంట్ ఉండటంతో ఆయన ఓటు వేయలేకపోయారు. మంత్రి పువ్వాడ అజరుకుమార్తోపాటు ఎమ్మెల్యేలు ఓటు వేశారు.
ఖమ్మం జడ్పీ చైర్మెన్ కమలరాజ్ క్యూలో ఓటర్ల వద్దకెళ్లి ప్రలోభాలకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చెప్పారు. దాంతో పోలీసులు అడ్డుకుని వారిని సమీపంలోని కాంగ్రెస్ ఆఫీసులోకి తోచుకుంటూ తీసుకెళ్లారు. స్వల్ప ఉద్రిక్తత ఏర్పడగా.. కొందరిని అరెస్టు చేశారు. దీన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అధికారపార్టీ ఏజెంట్లలా వ్యవహరిస్తున్నారని, తమ నాయకులను అన్యాయంగా అరెస్టు చేశారని భట్టి విమర్శించారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని, జడ్పీ చైర్మెన్ నాలుగు గంటలు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి రెండు గంటలు పోలింగ్ కేంద్రంలో ఉన్నారని అన్నారు.