Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారు కళాశాలల్లో జోష్
- ఏటా పెరుగుతున్న విద్యార్థులు
- ప్రస్తుత విద్యాసంవత్సరంలో 54,758 మందికి సీట్లు
- గతేడాది కంటే 5,593 మంది అధికంగా చేరిక
- గురుకులాల్లో మరో 9,249 మంది ప్రవేశం
- ప్రయివేటు కళాశాలల్లో మిగిలిన సీట్లు 1.64 లక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో 46 డిగ్రీ కాలేజీల్లో సున్నా ప్రవేశాలు నమోదయ్యాయి. వాటిలో చేరేందుకు విద్యార్థులెవరూ ముందుకు రాలేదు. ఇక 30లోపు విద్యార్థులు చేరిన కాలేజీలు 184 ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీలు నాలుగు, ప్రయివేటు కాలేజీలు 180 చొప్పున ఉండడం గమనార్హం. 49లోపు విద్యార్థులు ప్రవేశం పొందిన కళాశాలలు 247 ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కళాశాలలు 31, ప్రయివేటు కళాశాలలు 216 చొప్పున ఉన్నాయి. సున్నా ప్రవేశాలతోపాటు 49 మందిలోపు చేరిన కాలేజీలు రాష్ట్రంలో 477 ప్రమాదంలో ఉన్నాయని అర్థమవుతున్నది. ఆ కాలేజీలను ఏం చేయాలనే దానిపై ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ అధికారులు సమాలోచన చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో జోష్ కనిపిస్తున్నది. ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనం. సర్కారు కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 138 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 78,630 సీట్లుంటే, 54,758 (69.64 శాతం) మంది విద్యార్థులు చేరారు. అంటే 23,782 (30.36 శాతం) సీట్లు మాత్రమే మిగిలాయి. గత విద్యాసంవత్సరంలో 129 ప్రభుత్వ కాలేజీల్లో 75,340 సీట్లకుగాను, 49,165 (65.26 శాతం) మంది ప్రవేశం పొందారు. గతేడాది 26,175 (34.74 శాతం) సీట్లు మిగిలాయి. అంటే గత విద్యాసంవత్సరం కంటే ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ కాలేజీల్లో 5,593 మంది అధికంగా చేరడం గమనార్హం. 53 గురుకుల డిగ్రీ కాలేజీల్లో 16,144 సీట్లుంటే, 9,249 (57.29 శాతం) మంది చేరారు. వాటిలో 6,895 (42.71 శాతం) సీట్లు మిగిలాయి. విశ్వవిద్యాలయ అటానమస్ కాలేజీల్లో 80 నుంచి 90 శాతం వరకు మెరిట్ విద్యార్థులకే సీట్లు దొరుకుతున్నాయి. ప్రభుత్వ కాలేజీలు, గురుకులాలు కలిపి 191 కాలేజీల్లో 94,774 సీట్లకుగాను, 64,007 (67.54 శాతం) మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. 30,767 (32.46 శాతం) సీట్లు మాత్రమే మిగిలాయి.
ప్రయివేటు కాలేజీల్లో భారీగా మిగులుతున్న సీట్లు
ఇక ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో సీట్లు భారీగా మిగులుతున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 824 కాలేజీల్లో 3,39,110 సీట్లుంటే, 1,74,596 (51.43 శాతం) మంది విద్యార్థులు చేరారు. 1,64,714 (48.57 శాతం) సీట్లు మిగలడం గమనార్హం. గత విద్యాసంవత్సరంలోనూ 855 కాలేజీల్లో 3,36,070 సీట్లకుగాను, 1,73,550 (51.64 శాతం) మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. 1,62,520 (48.36 శాతం) సీట్లు మిగిలాయి. రాష్ట్రంలో విద్యాసంవత్సరంలో 1080 డిగ్రీ కాలేజీల్లో 4,66,345 సీట్లుంటే, 2,52,248 (54.09 శాతం) మంది విద్యార్థులు చేరారు. 2,14,097 (45.91 శాతం) సీట్లు మిగిలాయి. 2020-21 విద్యాసంవత్సరంలో 1103 డిగ్రీ కాలేజీల్లో 4,54,703 సీట్లకుగాను 2,47,601 మంది ప్రవేశం పొందారు. అంటే 2,07,102 సీట్లు మిగిలాయి. గత విద్యాసంవత్సరం కంటే ప్రస్తుత విద్యాసంవత్సరంలో 4,647 మంది అధికంగా చేరడం గమనార్హం.