Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక భద్రతా చట్టాన్ని చేయాలి
- ఎస్టీయూలను బలోపేతం చేయాలి : ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ సదస్సు డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశంలోని ప్రభుత్వ, ప్రయివేటు రవాణారంగ పరిశ్రమను పరిరక్షించాలని అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) డిమాండ్ చేసింది. దీనికోసం కేంద్రప్రభుత్వం తక్షణం సామాజిక భద్రతా చట్టాన్ని చేయాలని కోరింది. ఈనెల 9, 10 తేదీల్లో ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో రెండు రోజుల జాతీయ సదస్సు జరిగింది. సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఈ సదస్సును ప్రారంభించారు. ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి కేకే దివాకరన్ నివేదికను సమర్పించారు. డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆర్ లక్ష్మయ్య, అధ్యక్షులు జబిన్షా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సులో ప్రభుత్వ, ప్రయివేటు రవాణారంగాల్లోని సమస్యలు, పరిష్కారాలపై అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. రవాణా పరిశ్రమను కాపాడేందుకు,కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రెండ్రోజుల సదస్సు ఏకగ్రీవంగా కోరింది. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మె పిలుపును సదస్సులు సమర్ధిస్తూ, జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశాయి. ఆటో, టాక్సీ, ట్రక్, ప్రైవేట్ బస్సు వంటి అసంఘటిత రంగంలోని రవాణా కార్మికులెవరికీ ఎలాంటి చట్టబద్ధమైన ప్రయోజనాలు అందడం లేదని, వీరి కోసం సామాజిక భద్రతా చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రవాణా రంగంలోని కార్పొరేషన్లు (ఆర్టీసీలు) కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, కొన్ని ఆర్టిసిల్లో వేతనాలు చెల్లించే పరిస్థితి కూడా లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తిరోగమన విధానాలపై పోరాడాలని ససద్సులకు హాజరైన ప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానించారు. రైతాంగ ఉద్యమానికి లభించిన విజయాన్ని ప్రశంసిస్తూ సదస్సు తీర్మానాన్ని ఆమోదించింది. స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఎస్టీయూ)ను బలోపేతం చేయాలని, వాటికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. దేశవ్యాప్తంగా అన్ని ఎస్టీయూల్లో పేరుకుపోయిన రుణాలను వన్ టైమ్ సెటిల్మెంట్ ఈక్విటీలుగా ప్రభుత్వం మార్చాలని డిమాండ్ చేశారు. లక్షకు పైగా బస్సులను కేంద్ర ప్రభుత్వం సమీకరించాలని, దామాషా ప్రాతిపదికన అన్ని ఎస్టీయూలకు కేటాయించాలని కోరారు. డీజిల్, ఛాసిస్, విడిభాగాలు, వంటి వాటిపై ఎక్సైజ్ సుంకం, అమ్మకం పన్నుల నుండి ఎస్టీయూలను మినహాయించాలనీ, లాభనష్టాలు ప్రాతిపదికన వీటిని చూడరాదనీ, సామాజిక బాధ్యతగానే చూడాలని కోరారు. ఎం.వీ.యాక్ట్- 2019 సవరణ ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు సరైన వేతనాలు, పీఎఫ్, వసతి సదుపాయాలు, విశ్రాంతి గదులు వంటివి ఏర్పాటు చేయాలని కోరారు. ప్రయివేటు రంగ కార్మికులకు వచ్చే ఏడాది మార్చి వరకు వ్యక్తికి కిలోకు రూ.10 చొప్పున ఆహార ధాన్యాలు సరఫరా చేసి, రేషన్ కార్డు ఇవ్వాలనీ, అసంఘటిత రవాణా కార్మికులకు నెలకు రూ.7,500 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేశారు. కమర్షియల్ వెహికల్ డ్రైవర్లను కార్మిక శాఖలో నమోదు చేసి, వారికి కార్మిక చట్టాలు అమలయ్యేలా చట్ట సవరణలు చేయాలని సదస్సు డిమాండ్ చేసింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (టీఎస్ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్) ప్రతినిధులుగా ఉపాధ్యక్షులు కె గంగాధర్, ప్రచార కార్యదర్శి పీ రవీందర్‌రెడ్డి, జీఆర్ రెడ్డి, పి మల్లయ్య, రాజయ్య, ఉపేందర్‌చారి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.