Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాత్కాలిక లీజు పేరుతో అక్రమాలు
- సర్కార్ ఆదాయానికి ఏటా రూ. 40 కోట్ల గండి
- నగరానికి తక్కువే సరఫరా.. ఎగుమతులే ఎక్కువ..
- ఆ మంత్రి అండతోనే కేటాయింపు
- విజిలెన్స్ నివేదికపై సర్కార్ మౌనం
- లీజు రద్దుచేయాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ- హైదరాబాద్/మేడ్చెల్
హైదరాబాద్‌లోని చెంగిచెర్లలో ఆధునిక కబేళా మటన్ మాఫియా కబంధహస్తాల్లో చిక్కుకుంది. నగరవాసులకు నాణ్యమైన మటన్ అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కబేళా దేశ, విదేశాలకు ఎగుమతి కేంద్రంగా మారింది. నగరవాసులకు మాత్రం మంచి మటన్ అందకుండా పోయింది. కారుచౌకగా లీజుకు తీసుకోవడంతోపాటు జులై2018లోనే లీజు ముగిసినా కబేళాపై సలీం అండ్ కంపెనీ గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాడన్న విమర్శలున్నాయి. మళ్లీ టెండర్ పిలవాల్సిన తెలంగాణ గొర్రెల, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్(టీఎస్ఎస్జీడీసీఎఫ్).. వక్ఫ్‌బోర్డు చైర్మెన్ మహ్మద్ సలీం అండ్ కంపెనీకి తాత్కాలిక లీజు పేరుతో కట్టబెట్టింది. సీపీఐ(ఎం) పోరాటంతో విజి లెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. తాత్కాలిక లీజు అక్రమమని, దీంతో సర్కార్ ఆదా యానికి భారీగా నష్టం వాటిల్లిందని నివేదికలో పేర్కొంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఓ మంత్రి అండతోనే టెండర్లు లేకుండానే సలీం కంపెనీకి కట్టబెట్టారని విమర్శలొస్తున్నాయి.
70ఎకరాల్లో...
చెంగిచెర్లలో 70 ఎకరాల విశాల ప్రాంగణంలో రూ.30 కోట్లతో 2003లో ఆధునిక కబేళాను నిర్మించారు. హైదరాబాద్ మహానగరానికి నాణ్యమైన మాంసం అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. మాంసం ఎగుమతుల్లోనూ కోట్ల వ్యాపారానికి కేంద్రంగా మారింది. గ్రేటర్ ప్రజలకు నాణ్యమైన మటన్ అందించాలనే ఉద్దేశంతో అంబర్‌పేట, రాంనాస్పుర, న్యూబోయిగూడ, చెంగిచెర్ల రెండరింగ్ ప్లాంట్‌ను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఆధునీకరించారు. చెంగిచెర్ల కబేళాను తెలంగాణ గొర్రెల, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆధునీకరించారు. నాలుగు కబేళాల నుంచి వచ్చిన పశువులు, గొర్రెల గుండెకాయలు, కార్జాలు, ఇతర ముఖ్యమైన అవయవాలను శుభ్రం చేయడానికి 60 కెఎల్డి ట్రీట్మెంట్ ప్లాంట్‌ను చెంగిచెర్లలో నిర్మించారు. ఇదే చెంగిచెర్లలో షిఫ్ట్‌కు గొర్రెలు, మేకలు 6000, పశువులు 400 అంటే రోజుకు మూడు షిఫ్ట్‌ల్లో గొర్రెలు, మేకలు 18వేలు, పశువులు 1200 ప్రాసెసింగ్ జరుగుతుంది. ఈ కబేళా నిర్వహణకు టెండర్ పిలిస్తే ఏడాదికి సుమారు రూ.20 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశముంది.
అక్కడ అలా.. ఇక్కడ ఇలా!
జీహెచ్ఎంసీ పరిధిలోని కబేళాల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే చెంగిచెర్లలోని కబేళా నుంచి నామమాత్రపు ఆదాయమే వస్తోంది. అంబర్పేట్ కబేళా నిర్వహణ ద్వారా ఏడాదికి రూ.10.29 కోట్లు, న్యూ బోయిగూడ కబేళా ద్వారా రూ.9,29 కోట్లు, రాంనాస్‌పురా కబేళా ద్వారా రూ.5.19 కోట్ల ఆదాయం వస్తుంది. చెంగిచెర్ల కబేళాను మాత్రం 2008లో టెండర్ ధరకే అప్పగించారు. 2008లో టెండర్‌ను మహ్మద్ సలీం అండ్ కంపెనీ దక్కించుకుంది. 2008 నుంచి 2018 వరకు పదేండ్ల నిర్వహణకు సలీం సంస్థ ఒప్పందం చేసుకుంది. ఏడాదికి రూ.1.92 కోట్లు మాత్రమే చెల్లించారు. ఈ లీజు కాలం జులై2018లో ముగిసింది. టెండర్లు లేకుండానే మరోసారి తాత్కాలిక లీజు పేరుతో సలీం కంపెనీకి అప్పగించడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో...
చెంగిచెర్ల కబేళా నిర్వహణపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టి నివేదికను సర్కార్‌కు అందజేసింది. నివేదిక ఆధారంగా కబేళాకు సంబంధించిన భూములు, భవనాలు, యంత్రాలు, విద్యుత్, ఇతర సౌకర్యాల నిర్వహణ ఖర్చు ఏడాదికి రూ.4.30 కోట్లు చెల్లించాలి. కానీ నయాపైసా చెల్లించడం లేదు. దీంతోపాటు వ్యవసాయ మార్కెటింగ్ ఫీజు రూపంలో ఏడాదికి రూ.7 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ ఊసేలేదు. కబేళా ఆవరణంలో పశువులు, గొర్రెలు, మేకల కోసం మార్కెటింగ్ యార్డు, గోడౌన్, తోళ్ల మార్కెటింగ్ కోసం ప్రత్యేక షెడ్, ట్రేడర్లు, రైతులు, కమీషన్ ఏజెంట్ల కోసం వసతిగృహాలు, క్యాంటీన్ సౌకర్యాలు ఉన్నాయి. వీటన్నింటికీ ఎలాంటి ఫీజూ వసూలు చేయడంలేదు. దీంతోపాటు లోపల ఏం జరుగుతుందనే విషయం తెలుసుకునేందుకు తమకు అనుమతిలేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు ఎన్ని పశువులు, గొర్రెలు, మేకలను కోస్తున్నారు? నగరానికి ఎంత మాంసం వినియోగిస్తున్నారు? ఇతర ప్రాంతాలకు ఎంత ఎగుమతి చేస్తున్నారు? అనే విషయాలపై వివరాల్లేవు.
లీజు రద్దుచేయాలి : సీపీఐ(ఎం)
చెంగిచెర్ల ఆధునిక కబేళా లీజును టెండర్లు పిలవకుండానే పొడిగించడం అక్రమమని, తాత్కాలిక లీజును రద్దు చేయాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏసీబీతో విచారణ జరిపించాలన్నారు. ప్రజలకు నాణ్యమైన మాంసం అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నగరానికి చెందిన మంత్రి అండతోనే టెండర్లు లేకుండా సలీం కంపెనీకి అప్పగించారని ఆరోపించారు.