Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో రోజూ సమ్మె విజయవంతం
నవతెలంగాణ - సింగరేణి ప్రతినిధి
తెలంగాణలోని 4బొగ్గు బ్లాకుల వేలంలో విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసన కార్మిక సంఘాలు చేపట్టిన 72గంటల సమ్మె శుక్రవారం రెండోరోజూ విజ యవంతమైంది. సింగరేణి విస్తరించిన ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలోని 26 భూగర్భ గనులు, 19 ఓపెన్‌కాస్ట్ గనుల్లో కార్మికుల సమ్మెతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. సింగరేణి గుర్తింపు యూనియన్ టీబీజీకేఎస్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ), సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్‌టీయూసీి), సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ), సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ (హెచ్ఎంఎస్), సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఫ్‌ు (బీఎంఎస్)తో పాటు విప్లవ కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. ఐక్య సంఘటనగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారు. సింగరేణి బొగ్గు గనులు, కార్మిక వాడలు, పట్టణ ప్రధాన కూడళ్లలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, ధర్నాలు ప్రదర్శనలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం, టేకులపల్లి, ఇల్లందు, మణుగూరు, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రెండవ రోజు కార్మికులెవరూ విధులకు హాజరుకాలేదు. అత్యవసరం సిబ్బంది మినహా కార్మికులు పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొన్నారు. ఓపెన్ కాస్ట్ భూగర్భ, గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరగలేదు. కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట భైటాయించి ఎవరినీ ఆఫీస్‌లోనికి వెళ్లనివ్వకుండా ఆందోళన నిర్వహించారు. మణుగూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్‌లోని రామగుండం ఆర్జీ-1లోని బొగ్గు గనుల వద్ద బైక్ ర్యాలీ నిర్వహించారు. జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కార్మిక సంఘాలు వేర్వేరుగా ర్యాలీ నిర్వహించారు. రామగుండం ఓసీపీ - త్రీ గని పై కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని బొగ్గు గనుల వద్ద కార్మికులు ఎవరూ విధులకు హాజరుకాలేదు. తొలిరోజు మాదిరిగానే రెండో రోజు కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ సమ్మెకు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. భూపాలపల్లి ఏరియాలో సమ్మె విజయవంతమయ్యింది. కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఏరియాలోని గనుల్లో ర్యాలీ నిర్వహించారు.