Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరణశాసనం రాస్తున్నదెవరు?
- ఏడేండ్లలో ఐదువేల మందికి పైగా..
- అప్పులపాలై ప్రాణాలొదులుతున్న కౌలు రైతులు
- కలవరపెడుతున్న రవికుమార్ సూసైడ్ నోట్
పండిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వచ్చిన రైతులు వరి కుప్పలపై చనిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. మరోవైపు పచ్చనిపొలాల్లో పురుగుల మందు తాగి నిండు ప్రాణాలొదులుతున్నారు. గురువారం మెదక్ జిల్లాకు చెందిన రవికుమార్ అనే రైతు తన సమస్యలను ఏకరువు పెడుతూ సీఎంకు లేఖ రాసి ఆత్మహత్య చేసుకోవడం కలవరపాటుకు గురి చేసింది. ములిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తెలంగాణ రైతుల పరిస్థితి తయారైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రైతులు.. ప్రభుత్వాల రాజకీయ డ్రామాలకు బలవుతున్నారు. పాలకుల నిర్లక్ష్యమే అన్నదాతలకు మరణశాసనమవుతున్నది. రైతుబంధు, రైతుబీమా, ప్రాజెక్టుల ద్వారా నీటి వసతి, ఉచిత కరెంట్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్టు గొప్పలు చెబుతున్న పాలకులు...సమస్య మూలాల్లోకి పోవడంలేదు. భూమిని నమ్ముకుంటే బతుకు బాగుంటుందని భావించిన వారికి... ప్రస్తుతం ఆత్మహత్యలే శరణ్యవుతున్నాయి.
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అష్టకష్టాలు పడి పండించిన పంటను అమ్ముకుందామ నుకునే రైతు ఎన్నో గండాలు దాటాల్సి వస్తున్నది. వాటికి తోడు ప్రకృతి వైపరీత్యాలతో పంటలు ఆగమవుతున్నాయి. వ్యవ సాయం మీదనే ఆధారపడిన రైతులకు ఇలాంటి అవాంతరాలు ముంచెత్తడంతో విధిలేని పరిస్థితుల్లో విగతజీవులవుతున్నారు. పంట ఖర్చులు పెరిగిపోవడం, బ్యాంకు రుణాలు ఇవ్వకపో వడం, పంటలకు గిట్టుబాటు ధర దక్కకపోవడం, విద్య, వైద్యం ఖర్చులు రెట్టింపు కావడం, చేసిన అప్పులకు మిత్తిలు పెరిగి పోయి చివరికి అవి రైతుకు ఉరితాడవుతున్నది. ముఖ్యంగా కౌలు రైతులు పరిస్థితి రాష్ట్రంలో దయానీయంగా తయారైంది. వారిని తమ ప్రభుత్వం గుర్తించబోదని అసెంబ్లీసాక్షిగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మానసిక వేదనకు గురి చేస్తున్నాయి. కౌలు రైతులకు రుణార్హతలేదు. కౌలు చెల్లింపులు వారికి అదనపు భారం. ఉపాధి కోసం ఎంచుకున్న కౌలు వ్యవసాయం ఒడిదుడులకు లోనై ఆ రైతును చిక్కుల్లోకి నెట్టుతున్నది. దీని తోడు గత మూడేండ్లుగా వృద్ధాప్య, వితంతువు, వికలాంగులకు కొత్త పెన్షన్లు లేవు. ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లోనే కొత్త పెన్షన్లకు అనుమతి ఇచ్చింది తప్ప ఇతర ప్రాంతాల్లో ఇవ్వడం లేదు. అంత్యోదయ కార్డులను తగ్గించారు. అత్యంత నిరుపేద రైతులకు ఇవి కూడా సకాలంలో అందకపోవడం ఆత్మహత్యలకు ఒక కారణంగా చెప్పొచ్చు. ఈ క్రమంలో రైతులు ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నాయి.
ఆ నిబంధన రైతుకు నష్టం
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బీమా సౌకర్యం కల్పించింది. కానీ అందులో విధించిన నిబంధన ఎక్కువ మంది రైతులకు నష్టాన్ని చేకూరుస్తున్నాయి. 18-59 ఏండ్ల వయస్సు రైతులు చనిపోతేనే రైతు బీమా అందుతున్నది. ఆపైబడిన వయస్సు వారికి వర్తించడం లేదు. దీంతోపాటు కౌలు రైతు బీమాకు ఆమాడ దూరంలో ఉన్నాడు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు ఉంటే, అందులో 32 లక్షల మందికి మాత్రమే సర్కారు ప్రీమియం చెల్లిస్తున్నది. మరో 25 శాతం రైతుల మరణాలు లెక్కలోకి రావడంలేదని ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్య క్షులు సారంపల్లి మల్లారెడ్డి నవతెలంగాణకు చెప్పారు. మిగులు, ధనిక రాష్ట్ర మని చెబుతున్న పాలకులు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయి. ఏడేండ్లలో 4760మంది రైతులుఆత్మహత్యలు చేసుకు న్నారు. ఈచొప్పున సగటున ఏడాదికి 680మంది రైతులు ప్రాణాలొదులు తున్నారు. దేశంలోనే తెలంగాణ ఆత్మహత్యల్లో మూడోస్థానంలో ఉన్నది. వీరే కాకుండా కరెంట్ షాక్‌లతో ఏటా 650 మంది చనిపోతున్నారు. అలా మరణించిన వారికి విద్యుత్ రెగ్యులేటరీ 2లక్షలు పరిహారం ఇవ్వాలి. కానీ తప్పుడు సమాచారం లెక్కలు చూపించి ఆ పరిహారాన్ని ఎగ్గొడుతున్నారు.
వరి కుప్పలపై ఆగుతున్న గుండెలు
ప్రస్తుతం రాష్ట్రంలో తమ పంటను సకాలంలో అమ్ముకోలేక తీవ్ర మనోవేద నకు గురైన రైతులు వరి కుప్పలపై ప్రాణాలు విడుస్తున్నారు. వానలకు తడిసి, మొలకులొచ్చి కండ్ల ముందే ధాన్యం కరాబౌతుంటే రైతులు తీవ్ర మానసిక వేదనకు గురి అవుతున్నారు. పంటలకు సరైన ధర రావడంలేదు. తెచ్చిన అప్పులు తీరుస్తామో లేదోనన్న ఒత్తిడి పెరిగిపోతున్నది. మార్కెట్లో ధాన్యం రక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షెడ్ల నిర్మాణం, టార్ఫాలిన్లు అందించడంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వానికి స్పష్టతలేదని రైతు స్వరాజ్యవేదిక నేత కొండల్ తెలిపారు. రైతు ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బ్యాంకులు లోన్లు ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో రైతులు రూ 25వేల కోట్ల ప్రయివేటు అప్పులు తీసుకున్నారు. దీనికి వడ్డీ తడిసిమోపెడవుతున్నది. దీంతో అన్నదాతల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. రైతు సంక్షేమం అని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు ఆ దిశగా నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవాలి. రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నట్టు.. వ్వవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరల చట్టం తీసుకొస్తేనే రైతు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది.