Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి అన్ని రకాల బిల్లులు చెల్లించడానికి డ్రాయింగ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ (డీడీవో)లుగా ప్రిన్సిపాళ్లకు అవకాశం కల్పించాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్‌కు శనివారం టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, గాదె వెంకన్న, నగేశ్, రహీం, సమన్వయకర్త ఎం జంగయ్య వినతిపత్రం సమర్పించారు. గత 20 ఏండ్ల నుంచి ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేయడానికి అంకితభావంతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల వేతనాల్లో ఈ ఏడాది, ఏప్రిల్ ఒకటి నుంచి టీడీఎస్ రూపంలో పది శాతం కట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నియమితులై 12 నెలల వేతనంతో పని చేస్తున్నారని తెలిపారు. వారికి ప్రతినెలా ఒక సీఎల్, వివాహిత మహిళలకు మెటర్నటీ లీవ్ (వేతనం లేకుండా) రెండు నెలలు పని చేస్తున్నారని పేర్కొన్నారు. వారి వేతనం నుంచి ప్రొఫెషనల్ టాక్స్ పేరిట కోతలు ఉంటాయని వివరించారు. కాబట్టి వారిని 194 జీ కిందికి కాకుండా 192 పరిధిలోకి వచ్చేలా పరిగణిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ప్రతినెలా వారికి వేతనాలు మంజూరు చేస్తున్నప్పటికీ డీఐఈవోలు డీడీవోలుగా ఉండడం వల్ల వేతనాలు తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందువల్ల కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులకు ప్రతినెలా వేతనాలు చెల్లించడానికి ప్రిన్సిపాళ్లకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రస్తుతం వారికి వేతనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.