Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి కోసం ఉద్యమాలు
- కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గీత కార్మికుల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్రంలో దళిత బంధు తరహాలోనే గీతన్న బంధు పథకాన్ని ప్రవేశ పెట్టాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ రమణ డిమాండ్ చేశారు. గీత కార్మికుల ఉపాధి కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు.శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం మాటూరి బాలరాజ్ గౌడ్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న ఐదు లక్షల కుటుంబాల ఉపాధి కోసం సంబంధిత కార్పొరేషన్‌కు రూ. 5వేల కోట్లు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. తరతరాలుగా ఇదే వృత్తిని నమ్ముకుని పనిచేస్తున్నారనీ, ప్రభుత్వానికి పన్నులు కడుతున్నామని తెలిపారు. వీరికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. సర్కారు తెచ్చిన లిక్కర్ విధానం వల్ల గీత వృత్తి దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్, బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా అనుమతులిచ్చి, గీత కార్మికులకు పూర్వ వైభవం తెస్తామంటూ చెప్పడంలో అర్థం లేదని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా..మధ్య నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రతి సొసైటీకి ఐదెకరాల భూమి,కల్లుకు మార్కెట్ సౌకర్యం, నీరా,తాటి ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. వృత్తిదారులకు బైక్‌లు ఇవ్వాలన్నారు. పెన్షన్‌ను ఐదు వేలకు, ఎక్స్‌గ్రేషియాను పది లక్షలకు పెంచాలని కోరారు.మెడికల్ బోర్డు నిబంధన తొలగించాలనీ, అర్హులైన వారందరికీ సభ్యత్వం,గుర్తింపు కార్డులు కొత్త జిల్లాల పేరుతో ఇవ్వాలని కోరారు.సమావేశంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్లు యు వెంకట నర్సయ్య, బెల్లం కొండ వెంకటేశ్వర్లు,చౌగాని సీతారాములు,బి అర్జున్,కొహెడ కొమరయ్య, వెంకట మల్లయ్య, గాలి అంజయ్య, అబ్బాగాని బిక్షం తదితరులు పాల్గొన్నారు.