Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయుల్లో గందరగోళం నివారించాలి
- సీనియార్టీతోపాటు స్థానికతనూ పరిగణనలోకి తీసుకోవాలి
- టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయులకు సంబంధించి సమగ్రమైన సీనియార్టీ జాబితాను రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తద్వారా ఉపాధ్యాయుల్లో నెలకొన్న గందరగోళం నివారించాలని కోరింది. సీనియార్టీతోపాటు స్థానికతనూ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపు కోసం రూపొందిస్తున్న సీనియార్టీ జాబితాలు లోపభూయిష్టంగా ఉన్నాయని తెలిపారు. పలు జిల్లాల్లో అప్పీల్ చేసుకునే సమయాన్ని సైతం ఇవ్వడం లేదని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని వివరించారు. ఉపాధ్యాయ సంఘాలతో ఈనెల 13న విద్యాశాఖ మంత్రి సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో ఎదురౌతున్న ఇబ్బందులను సమావేశంలో చర్చించి పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈలోగానే జిల్లాల కేటాయింపు జరిగిపోతుందన్నంత హడావుడి నెలకొన్నదని తెలిపారు. స్థానిక క్యాడర్ల కేటాయింపులో స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం సీనియార్టీ ఆధారంగానే నూతన జిల్లాలకు కేటాయిస్తామనటం వల్ల ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నదని వివరించారు. ఆ సీనియారిటీ జాబితాలూ సక్రమంగా రూపొందించలేక పోవటంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పలువురు ఉపాధ్యాయులు డీఈవో కార్యాలయాల వద్ద స్వచ్ఛందంగా నిరసన తెలుపుతున్నారని పేర్కొన్నారు.ఇతర శాఖల ఉద్యోగులు సంఖ్యరీత్యా కొద్ది మంది మాత్రమే ఉంటారని తెలిపారు. ఎక్కువ పోస్టులు జోనల్ క్యాడర్లో ఉన్నాయని వివరించారు. విభజన ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని పేర్కొన్నారు. కానీ లక్షపైగా ఉన్న ఉపాధ్యాయులలో అత్యధికులు ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ తత్సమాన పోస్టులని తెలిపారు. అవన్నీ జిల్లా క్యాడర్ పోస్టులుగా ఉన్నాయనీ, వారందరినీ పూర్వపు జిల్లాల వారీగా, కేటగిరీల వారీగా సీనియార్టీ జాబితాలను రూపొందించటం అంత సులభమైన పని కాదని పేర్కొన్నారు. ప్రత్యక్ష నియామకం ద్వారా చేరిన వారికి వారి ర్యాంకుల ఆధారంగానూ, పదోన్నతి ద్వారా చేరిన వారికి పూర్వపు సీనియార్టీకి భంగం కలుగకుండా సబ్జెక్ట్ వారీగా సీనియార్టీ జాబితాలు తయారు చేయాలని సూచించారు. కానీ హడావుడిగా జాబితాలు తయారు చేయమన్నారు కనుక అవన్నీ పరిశీలించకుండా సులభంగా ఉంటుందని ఉద్యోగంలో చేరిన తేదీ, ఒకే తేదీన చేరితే పుట్టిన తేదీ ప్రాతిపదికన సీనియార్టీ జాబితాలు రూపొందిస్తున్నారని విమర్శించారు. ఇది మరిన్ని వివాదాలకు కారణమౌతుందని తెలిపారు. ఉపాధ్యాయుల సర్దుబాటుకు కొంత సమయం తీసుకుని సమగ్రమైన సీనియారిటీ జాబితాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. స్థానికతనూ పరిగణనలోకి తీసుకుని నూతన జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరారు.