Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొగ్గుగనుల ప్రయివేటీకరణ ఉపసంహరించుకోవాలి
- సింగరేణి భవన్ ఎదుట సీఐటీయూ ధర్నా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కాలరీస్ పరిరక్షణకు ప్రజాఉద్యమాన్ని నిర్మిస్తామని సీఐటీయూ నాయకులు స్పష్టం చేశారు. బొగ్గుగనుల ప్రయివేటీకరణను కేంద్రప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ ప్రధాన కార్యాలయం ఎదుట సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సింగరేణిని రక్షించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బీ మధు, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేష్, ఉపాధ్యక్షులు సీ మల్లేష్, తెలంగాణ రాష్ట్ర శ్రామిక మహిళ కన్వీనర్ ఆర్ రమ, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ జే రాఘవరావు, సీఐటీయూ నాయకులు ఆర్ వాణి, కే రమేష్, ఎమ్డీ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈనెల 9 నుంచి మూడు రోజులు జరిగిన సింగరేణి కార్మికుల సమ్మెకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ పరిరక్షణకు, కార్మికుల ఐక్యతకు ఇదే నిదర్శనమని ఉదహరించారు. ఇది కార్మికుల ఆర్థిక పోరాటం కాదనీ, సంస్థ పరిరక్షణ కోసమేననీ, భవిష్యత్ పోరాటాల్లో ప్రజలు, ప్రజాసంఘాలు భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో అనేకమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సింగరేణిని నాశనం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. కేంద్రప్రభుత్వం వేలంపాటలో పెట్టిన సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు బ్లాకుల అభివృద్ధి కోసం సంస్థ ఇప్పటికే రూ.66 కోట్లు ఖర్చుచేసిందన్నారు. 2018లో వీటిలో ఒకటైన మంచిర్యాల జిల్లా కేకే-6 మైన్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన కూడా చేశారని చెప్పారు. ఇప్పుడు వాటన్నింటినీ లాక్కుని కేంద్రం ప్రయివేటుకు కట్టబెట్టాలని చూడటం దుర్మార్గమని విమర్శించారు. ఆ నాలుగు బ్లాకుల్ని సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. బొగ్గు గనులు ప్రయివేటు వ్యక్తుల చేతిలోకి వెళ్తే, విద్యుత్, సిమెంట్, స్టీలు సహా అనేక రంగాలపై ఆ ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిలోని కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వ చర్యల్ని కచ్చితంగా తిప్పికొడతామని స్పష్టం చేశారు. అనంతరం సింగరేణి కాలరీస్ చీఫ్ లైజనింగ్ ఆఫీసర్ బి మహేష్ ధర్నా ప్రాంతానికి వచ్చి, వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.