Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్వీకే వెబినార్‌లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పంటలకు కనీస మద్ధతు ధరల చట్టం (ఎమ్ఎస్పీ), గ్యారంటీని వెంటనే తేవాల్సిన అవసరముందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్.వినరు కుమార్ సమన్వయకర్తగా శనివారం కనీస మద్ధతు ధర - చట్టం ఆవశ్యకత అనే అంశంపై వెబినార్ జరిగింది. ఈ సందర్భంగా రిటైర్డ్ ప్రొఫెసర్లు డి.నర్సింహారెడ్డి, ఎ.ప్రసాద్ రావు, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ ప్రసంగించారు. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు, పెట్టుబడీదారీ వ్యవస్థ, కార్పొరేట్ల కక్కుర్తి వెరసి రైతుతో పాటు ప్రజలకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయని వారు చెప్పారు. నూతన ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాక లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సింహారెడ్డి మాట్లాడుతూ, కనీస మద్ధతు ధరను నిర్ణయించే విషయంలో లోటుపాట్లున్నాయని తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉత్పత్తి ఖర్చు ఒకే రీతిగా లేదని చెప్పారు. ఎమ్ఎస్పీకి చట్టబద్ధత అవసరమనీ, అయితే దాన్ని సమగ్రంగా రూపొందించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రవాణా, నిల్వ తదితర సదుపాయాలను మెరుగుపరచకుండా కేవలం ఎమ్ఎస్పీ మాత్రమే చేస్తే సరిపోదని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల పాత్రను నికరంగా పేర్కొనాలని సూచించారు.
కేరళ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి
కూరగాయలకు కూడా మద్ధతు ధరలు ప్రకటించిన కేరళ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రసాదరావు సూచించారు. ఆ రాష్ట్రంలో ఎమ్ఎస్పీని ప్రకటించి, ఆ పంటలను సేకరించి, వినియోగదారులకు అందిస్తున్నారని గుర్తుచేశారు. కార్పొరేటీకరణ, వాతావరణ పరిస్థితులు, సాంకేతికత, అంతర్జాతీయ ఇబ్బందులను తట్టుకుని రైతు నిలబడాలంటే ఎమ్ఎస్పీ అవసరమని అభిప్రాయపడ్డారు. రూ.ఒక లక్ష కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేటశారు.
ఆత్మహత్యలు నివారించిన వామపక్ష ప్రభుత్వం
కేరళలో వామపక్ష ప్రభుత్వం రుణ విమోచన చట్టం తెచ్చాక అక్కడ ఆత్మహత్యలు ఆగిపోయాయని సాగర్ తెలిపారు. వామపక్ష అనుబంధ రైతు సంఘాలే కాకుండా దేశవ్యాప్తంగా రైతుసంఘాలు ఆ తరహా చట్టం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు.ఎంఎస్పీ చట్టమైతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఇంగ్లీషు చానెల్స్, పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఆ చట్టం అమలైతే రైతుల కొనుగోలు శక్తి పెరుగుతుందనీ, ఫలితంగా పారిశ్రామిక రంగానికి ఊతమొస్తుందని తెలిపారు. తద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. కేవలం కార్పొరేట్ల కోసమే ఇంగ్లీషు మీడియా గగ్గోలని ఆగ్రహం వ్యక్తం చేటశారు. భవిష్యత్తుల్లో చట్ట సాధన కోసం ఐక్య పోరాటాలు చేస్తామని తెలిపారు.ఎమ్ఎస్పీ ముసాయిదా చట్టం- వాటి వివరాలపై ఇంకో వెబినార్‌ను నిర్వహిస్తామని వినరు కుమార్ తెలిపారు.